పార్టీలు సోల్డ్ అవుట్.. సీన్ రిపీట్
సామదానభేదోపాయాలకు లొంగిపోయి రాష్ట్రంలోని పార్టీలన్నీ కేంద్రానికి దాసోహం అంటున్నాయి. అయినా పైపై విమర్శలు, ఆందోళనలతో రాజకీయ నాటకానికి తెర తీస్తున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమం వారి తాజా [more]
సామదానభేదోపాయాలకు లొంగిపోయి రాష్ట్రంలోని పార్టీలన్నీ కేంద్రానికి దాసోహం అంటున్నాయి. అయినా పైపై విమర్శలు, ఆందోళనలతో రాజకీయ నాటకానికి తెర తీస్తున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమం వారి తాజా [more]
సామదానభేదోపాయాలకు లొంగిపోయి రాష్ట్రంలోని పార్టీలన్నీ కేంద్రానికి దాసోహం అంటున్నాయి. అయినా పైపై విమర్శలు, ఆందోళనలతో రాజకీయ నాటకానికి తెర తీస్తున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమం వారి తాజా పొలిటికల్ డ్రామాకు వేదిక. రాజకీయ నాయకులు ప్రజల కళ్లకు గంతలు కట్టాలనే చూస్తారు. అయిపోయిన పెళ్లికి భజంత్రీలు వాయిస్తారు. ఏదేదో జరగబోతోందనే నమ్మకం కలిగిస్తారు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట గతంలో చేసిన హడావిడే ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలోనూ రిపీట్ అవుతోంది.
దొరికిపోయారు పవన్….
ఇంకా రాజకీయాల్లో పూర్తిగా తలపండని పవన్ కల్యాణ్ మాత్రం దొరికిపోతున్నారు. మిగిలిన పార్టీలు చ క్కగా తప్పించుకునే ఎత్తుగడలు వేస్తున్నాయి. విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తానంటూ ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ కు భంగపాటు ఎదురైంది. తన స్థాయికి మించిన పని భుజానికి ఎత్తుకున్న పవర్ స్టార్ కు కేంద్రం తేల్చిచెప్పేసింది. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మిగిలిందేమీ లేదని, ఉపసంహరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. నిజానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరహాలో ఒక లేఖ రాసి వదిలేసి ఉంటే బాగుండేదని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్యాక్టరీని కాపాడాల్సిన ప్రధాన బాధ్యత వైపీపీది. లోక్ సభలో 22 మంది ఎంపీలున్నారు. రాజ్యసభలో ఆరుగురు సభ్యులున్నారు. ముఖేష్ అంబానీ కోటాలోని నత్వానిని పక్కనపెట్టినా 27 మంది సభ్యులు పార్లమెంటును స్తంభింప చేస్తే వచ్చే ప్రకంపనలు వేరు. కానీ అధికార పార్టీ దీనిని సీరియస్ గా తీసుకోవడం లేదు. కేంద్రంపై విరుచుకుపడేందుకు సాహసించడం లేదు. ఇతర పార్టీలు ఎలాగూ తామున్నామంటున్నాయే తప్ప తెగింపునకు దిగడం లేదు.
తోసేస్తే పోతుందిగా…
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ ఉర్రూతలూగించిన నాటి ఉద్యమ స్ఫూర్తి ఈరోజున కరువైంది. రాజకీయ పార్టీలు అన్నీ సంఘీభావం ప్రకటిస్తున్నాయి. కార్యాచరణకు సిద్ధం కావడం లేదు. రాజకీయంగా ప్రాముఖ్యం కోల్పోయి తనకు ఒక అజెండా, జెండా కావాలని కోరుకుంటున్నారు గంటా శ్రీనివాసరావు. భలే చాన్సులే అనుకుంటూ రాజీనామాకు దీనిని సాకుగా చేసుకున్నారు. అంతకుమించి ప్రధాన పరిణామాలేమీ లేవు. పార్టీలన్నీ ఎదుటి పక్షమే ప్రధాన బాద్యత తీసుకోవాలన్నట్లుగా మాట్లాడటం విచిత్రం. తెలుగుదేశం ఉద్యమ విషయంలో నీళ్లు నములుతోంది. ఇప్పటికే ఏదోరకంగా కేంద్రానికి చేరువ కావాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత అనవసర వివాదాన్ని తలకెత్తుకునేందుకు సిద్దంగా లేరు. అందుకే విశాఖ ఉక్కుపై టీడీపీ కార్యాచరణ ఏరకంగా ఉండబోతుందో చెప్పలేకపోతున్నారు. బీజేపీ నాయకుల మాటలకు, చేతలకు పొంతనే లేదు. ఎన్నికలకు ముందు విశాఖ కు మంజూరు చేసిన రైల్వేజోన్ ను ఇంతవరకూ ఆచరణలోకి తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఉక్కు కర్మాగారాన్ని కాపాడేంత శక్తి వారికి లేదనేది అందరికీ తెలిసిందే. వామపక్షాలు క్షీణించిన బలంతో ఉన్నాయి. ఉద్యమాన్ని నిర్మించగల బలం వాటికి సమకూరడం లేదు.
సీఎం సానుకూలం…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే సానుకూలత వ్యక్తం చేశారనేది తాజాగా తెలియవస్తున్న సమాచారం. ఒక్కసారిగా విక్రయం కాకుండా షేర్ల రూపంలో ప్రయివేటు వ్యక్తులు కొనుగోళ్లు జరుపుకునేందుకు అవకాశమిస్తే బాగుండేదనేది సీఎం అభిప్రాయంగా చెబుతున్నారు. అది కూడా మరో రూపంలో ప్రయివేటీకరణే. అంతేకాకుండా పోస్కోతో 2019లోనే ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిని పోస్కో ప్రతినిధులు సైతం కలిసినట్లుగా కేంద్రమంత్రి పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో , ముఖ్యమంత్రికి ఈవిషయం అంతా ముందుగానే తెలుసు. బడ్జెట్ సందర్భంగా కేంద్రం బయటపెట్టింది అంతే. ఎంపీలు కేంద్ర బడ్జెట్ ను విమర్శిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం కొంత సానుకూలత కనబరుస్తున్నారు. వైసీపీ పార్లమెంటులో అనుసరించాల్సిన విధానాలపై స్పష్టత లేదని అర్థమవుతోంది. అందువల్ల విశాఖ ఉక్కు అంశంలో అధికార పార్టీ పెద్దగా ముందడుగులు వేసే అవకాశం కనిపించడం లేదు.
విజయసాయి రాజకీయం…
పార్లమెంటరీ పార్టీ నేతగా, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జిగా ఉన్న విజయసాయి రెడ్డి ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంటును స్తంభింపచేసే బాధ్యతను తీసుకోవాల్సింది ఆయనే. వైసీపీ కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కార్యాచరణకు పూనుకుంటే జాతీయంగా చర్చనీయమవుతుంది. కానీ విశాఖలో ఆందోళనలో పాల్గొని సంఘీభావం ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు విజయసాయి. అంతేకాకుండా రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. అంటే వైఫల్యాన్ని అందరూ కలిసి పంచుకుందామని చెప్పేసినట్లే. ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి వెళ్లదన్న సంగతి విజయసాయికి తెలుసు. పైపెచ్చు తీవ్రమైన ప్రతిఘటనతో కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లో వైసీపీ లేదన్న అంశమూ ఆయనకు ఎరుకే. అందుకే పార్టమెంటులో పాత్ర పోషించడం మానేసి, ఫీల్డు లెవెల్ లో ఉత్తరాంధ్ర ప్రజలను సంతృప్తి పరిచేందుకు పూనుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో అంతా జరిగిపోయాకా, ఉత్తుత్తి ఉద్యమాలతో ప్రజలను రాజకీయ పార్టీలు మభ్యపెట్టాయి. ఇప్పుడు కూడా మరోసారి సీన్ రిపీట్ చేయబోతున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్