ఫ్యాక్ట్ చెక్: భీమవరం లోని ఓ దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన వెనుక ఎలాంటి మతపరమైన కోణం లేదు
ఆ వ్యక్తి ఓ మానసిక వికలాంగుడు అని పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు ఎక్కువయ్యాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలోకి ప్రవేశించిన ఓ ముస్లిం వ్యక్తి విగ్రహాన్ని తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. వ్యక్తిత్వ వికాస తరగతుల కోసం మహారాష్ట్ర నుండి నిందితుడు సల్మాన్ హైదరాబాద్ కు వచ్చాడు.
ఇక శంషాబాద్ లో కూడా ఆలయంలో విగ్రహాల ధ్వంసం జరిగింది. ఎయిర్ పోర్టు కాలనీలోని హనుమాన్ ఆలయంలో ఈ ఘటన జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు.
ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలోని ఆలయాన్ని ఇతర మతానికి చెందిన వ్యక్తులు ధ్వంసం చేశారంటూ కొందరు పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నారు.
"సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విద్వంసం చేసిన తరహాలో భీమవరం లో హిందూ దైవ విగ్రహాలు ద్వంసం చెయ్యటానికి ప్రయత్నించిన ఓక మరకని పట్టుకొని దేహ శుద్ధి చేసి స్టేషన్ లో అప్ప చెప్పిన స్థానికులు వాడి దగ్గర ఇంకా చెయ్య వలసిన లిస్ట్ కూడా ఉండడం అనేది బరతెగించిన మత ఉన్మాదానికి నిదర్శనం, హిందువులు ఇలాంటి వెధవలను ఊరికే కొట్టడంలో ఎలాంటి ప్రయోజనం లేదు , మరొకసారి ఇలాంటి పనుచేయకుండా ఇలాంటి మత ఉన్మాదులకు హెచ్చరికగా మోకాలి చిప్పలు పగుల గొట్టాలి యిదే సరి అయిన పరిస్కారం" అంటూ పోస్టులు పెట్టారు.
"ఆలయాల లిస్ట్ తయారు చేసుకుని మరి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. భీమవరం రామాలయంలో ఓ ఇస్లామిస్ట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతని బ్యాగ్ నుండి ఆలయాల జాబితా రికవరీ చేయబడింది. దేహశుద్ధి చేసి ఊరేగించి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.ముత్యాలమ్మ దేవాలయం తరహాలో ఆలయ విగ్రహాలను ధ్వంసం చేయాలని ప్లాన్ చేయడం ,హిందుల వేషధారణలో వచ్చి ధ్వంసం చేయడమే ఈ ముఠా పని." అంటూ ChotaNews ట్విట్టర్ ఖాతాలో కూడా వీడియోను పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి ముస్లిం కాదని ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం స్పష్టం చేసింది.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేశాం. డైలీ హంట్ లో వచ్చిన కథనాన్ని మేము గుర్తించాం.
'రాయలం ఏరియా కోదండ రామాలయం వద్ద ఒక అపరిచితుడు అనుమానంగా తిరుగుతున్నాడని తెలియడంతో.. అటుగా వెళ్తున్న ఇద్దరు స్థానికులు నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు అతను జవాబు చెప్పే స్థితిలో లేడు. ఏదో అర్థం కాని భాష మాట్లాడడంతో జనం అంతా చుట్టూ చేరి అతడిని కొట్టారంటూ' డైలీ హంట్ నివేదికను మేము చూశాం.
ఇక ఈ ఘటనకు సంబంధించి టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారని అదే కథనంలో తేలింది. వారి విచారణలో ఆ వ్యక్తి పేరు దిలీప్ అని తేలింది. అతని పేరు దిలీప్.. ఊరు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం. మతి స్థిమితం కోల్పోయి ఊళ్లు తిరుగుతున్నాడని తెలుసుకున్నారు పోలీసులు. మూడేళ్లుగా భీమవరం చుట్టు పక్కల తిరిగి రోడ్డు పక్కన కాగితాలు, ఖాళీ వాటర్ బాటిల్స్ ఏరుకుంటున్నాడని తెలుసుకున్నారు.
"పిచ్చి వాడిని కొట్టి ‘జైశ్రీరామ్’ అని పలికించిన జనం!" అంటూ thefederal.com లో ఓ కథనాన్ని కూడా మేము చూశాం.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు తెలుసుకోడానికి మేము భీమవరం పోలీసులను సంప్రదించాం. వారు కూడా ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, మానసిక వికలాంగుడు ఆ వ్యక్తి అని ధృవీకరించారు.
ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ఫ్యాక్ట్లీ కూడా వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ ధృవీకరించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : భీమవరంలోని ఆలయంలో విగ్రహాల ధ్వంసం వెనుక ఇతర మతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు
Claimed By : social media users
Fact Check : False