ఫ్యాక్ట్ చెక్: COVID-19 లాక్ డౌన్ సమయంలో తిరుమల గర్భగుడిని రికార్డు చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు.
కరోనా లాక్ డౌన్ సమయంలో రికార్డు చేసిన తిరుమల గర్భగుడికి సంబంధించిన వీడియో
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలకు సంబంధించిన నిబంధనల్లో ఎన్నో మార్పులు చేశారు. దర్శనానికి సమయాన్ని తగ్గించడం దగ్గర నుండి ఎన్నో మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2025లో తిరుమలలో జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు.
జనవరి 10-19 మధ్య జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా చెల్లుబాటు అయ్యే దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు మాత్రమే అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి కారణంగా టీటీడీ అదనపు ఈవో సూచన లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పది రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 10-19 మధ్య శిశువులు, వృద్ధులు, శారీరక వికలాంగులు మొదలైన వారికి అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. అలాగే గోవిందమాల భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయబోమని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా డిమాండ్‌ను తట్టుకోవడానికి టీటీడీ రోజువారీ సగటు స్టాక్ 3.5 లక్షల లడ్డూలకు అదనంగా 3.5 లక్షల అదనపు లడ్డూల బఫర్ స్టాక్‌ను సిద్ధం చేస్తోంది.
ఇంతలో తిరుమల గర్భగుడికి సంబంధించిన వీడియో అంటూ ఓ ఆలయం లోపలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. COVID-19 మహమ్మారి సమయంలో భక్తులు లేని సమయంలో చిత్రీకరించిన అరుదైన వీడియో ఇది చెబుతున్నారు. ఏకాంత దర్శనం సందర్భంగా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన వీడియో అని చెబుతున్నారు.
ఇంతలో తిరుమల గర్భగుడికి సంబంధించిన వీడియో అంటూ ఓ ఆలయం లోపలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. COVID-19 మహమ్మారి సమయంలో భక్తులు లేని సమయంలో చిత్రీకరించిన అరుదైన వీడియో ఇది చెబుతున్నారు. ఏకాంత దర్శనం సందర్భంగా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన వీడియో అని చెబుతున్నారు.
పలువురు నెటిజన్లు ఇది కరోనా మహమ్మారి సమయంలో తీసిన వీడియో అంటూ చెబుతున్నారు.
వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
తిరుమలలో ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించి సెక్యూరిటీ చాలా కఠినంగా ఉంటుంది. టీటీడీ అధికారులకు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకుని వెళ్ళడానికి అసలు అనుమతి ఉండదు. ముఖ్యంగా, కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా భక్తులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఆలయంలోకి తీసుకెళ్లకూడదు. మొబైల్ ఫోన్లు, కెమెరాల వినియోగాన్ని నిషేధించారు.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 'ది హిందూ' మీడియా సంస్థ కథనం మాకు కనిపించింది.
టీటీడీ ఛానల్ కు సంబంధించి షూటింగ్ లను చూసుకోడానికి తిరుమల ఆలయాన్ని పోలిన నమూనా ఆలయాన్ని అలిపిరి వద్ద తీర్చిదిద్దారు. చలనచిత్ర షూటింగ్‌లు, టీవీ కార్యక్రమాల కోసం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయం ప్రతిరూపం అలిపిరి వద్ద ఉందని తెలిపారు.
దీన్ని క్యూగా తీసుకుని మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా.. శ్రీవారి నమూనా ఆలయానికి సంబంధించిన పలు వీడియోలను నెటిజన్లు షూట్ చేసి పెట్టారు. పలు యూట్యూబ్ ఛానల్స్ లో నమూనా ఆలయాన్ని అప్లోడ్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియో లోనూ ఈ వీడియోలలో ఉన్న ప్రాంతం ఒకేలా అనిపించింది. పలు ప్రాంతాలకు సంబంధించిన పోలికలు కూడా సరిపోలాయి.
నమూనా ఆలయానికి సంబంధించిన వివరణను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కూడా విడుదల చేసింది.
నమూనా ఆలయాన్ని 2015 సెప్టెంబర్ లో అప్పటి టీటీడీ అధికారులు పరిశీలించిన టీటీడీ వెబ్ సైట్ కథనాన్ని కూడా మేము కనుగొన్నాం. అందులో నమూనా ఆలయానికి సంబంధించిన ఫోటోలను మనం చూడొచ్చు.
ఇటీవలి కాలంలో తిరుమల ఆలయానికి సంబంధించిన వీడియోలు ఏమైనా లీక్ అయ్యాయా అని తెలుసుకోడానికి మేము టీటీడీ అధికారులను సంప్రదించాం. అలాంటిదేమీ జరగలేదని తెలిపారు. వైరల్ వీడియో అలిపిరి లోని నమూనా ఆలయానికి సంబంధించిందని వివరించారు. తిరుమల లోని కరోనా సమయంలో కూడా కెమెరాలను అనుమతించలేదని చెప్పారు. తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రజలను కోరారు టీటీడీ అధికారులు.
ఇక వైరల్ పోస్టులో ఎలాంటి నిజం లేదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇదే వీడియో గతంలో కూడా ఇలాంటి వాదనతోనే వైరల్ అయింది. అప్పుడు కూడా టీటీడీ అధికారులు ఈ కథనాలను ఖండించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోలో ఉన్నది అలిపిరి లోని నమూనా ఆలయానికి సంబంధించిన వీడియో.
Claim : కరోనా లాక్ డౌన్ సమయంలో రికార్డు చేసిన తిరుమల గర్భగుడికి సంబంధించిన వీడియో
Claimed By : Social Media Users
Fact Check : False