ఫ్యాక్ట్ చెక్: వేయి స్థంభాల గుడి మండపంలో క్రైస్తవ మత ప్రార్థనలు నిర్వహించలేదు
వరంగల్ వేయి స్తంభాల గుడి మండపంలో క్రైస్తవమత ప్రార్థనలు. ఉద్దేశ్య పూర్వకంగా రెచ్చకొడుతున్న క్రైస్తవులు. చోద్యం చూస్తున్న దేవాదాయశాఖ.
"వరంగల్ వేయి స్తంభాల గుడి మండపంలో క్రైస్తవమత ప్రార్థనలు. ఉద్దేశ్య పూర్వకంగా రెచ్చకొడుతున్న క్రైస్తవులు. చోద్యం చూస్తున్న దేవాదాయశాఖ." అంటూ కొందరు పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.వరంగల్‌లోని “వెయ్యి స్తంభాల గుడిలో క్రైస్తవులు ప్రార్థన చేస్తూ కనిపించారు” అనే వాదనతో ఒక గుడి ఆవరణలో కొంతమంది వ్యక్తులు ప్రార్థనలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ వీడియో కింద “వరంగల్ వెయ్యి స్తంభాల గుడి మండపంలో క్రైస్తవ ప్రార్థనలు. క్రైస్తవులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు.” అంటూ చెప్పుకొచ్చారు.
సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు కూడా క్రైస్తవులు వేయి స్తంభాల గుడిలో ప్రార్థనలు / సామూహిక ప్రార్థనలు చేసే అవకాశాన్ని సూచిస్తూ వీడియోను ట్వీట్ చేశారు. (అయితే, అది వేరే దేవాలయం నుండి కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు)
ఫ్యాక్ట్ చెకింగ్:
వీడియోలో ఉన్నది వేయి స్తంభాల గుడి కాదని.. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని మేము కనుగొన్నాము.ఎం.నాగేశ్వరరావు ట్వీట్‌కు వరంగల్‌లోని పోలీస్ కమిషనర్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ సమాధానం ఇచ్చింది. వరంగల్ కోటలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు కూడా అందులో పేర్కొన్నారు.తెలంగాణ పోలీసుల వెరిఫైడ్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా కూడా స్పందించారు. వీడియో వేయి స్తంభాల గుడిది కాదని ధృవీకరించారు. అటువంటి వీడియోలను ఫార్వార్డ్ చేసే ముందు వాటి ప్రామాణికతను ధృవీకరించాలని సూచించింది.వేయి స్తంభాల గుడి వద్ద ఘటన జరగలేదని తెలంగాణ పోలీసు చీఫ్ కూడా తెలిపారు. ఆ వాదన అబద్ధమని ధృవీకరించారు. లౌకిక ధర్మాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ కట్టుబడి ఉందని, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.
వరంగల్ కోటలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. కోటలోని హిందూ దేవాలయంలో క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించినందుకు పాస్టర్, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాకతీయ పాలకులు నిర్మించిన హిందూ దేవాలయాల ముందు క్రైస్తవులు ప్రార్థనలు చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ దేవుళ్లను అవమానించేలా కార్యక్రమం నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే వీహెచ్‌పీ, ఇతర హిందూ సంస్థలు ఆందోళనలు చేపడతాయని హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.https://www.opindia.com/2023/04/fir-registered-against-a-pastor-for-conducting-christian-prayers-a-hindu-temple-in-warangal-report/ https://www.deccanchronicle.com/nation/in-other-news/100423/vhp-fumes-after-christians-perform-prayers-at-temples.html క్రైస్తవులు వేయి స్తంభాల గుడి లోపల ప్రార్థనలు నిర్వహించలేదు. వరంగల్ కోటలోని మరో ఆలయం ఆవరణలో ప్రార్థనలు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఈ ఘటనకు బాధ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
Claim : Christians were found praying inside the Thousand Pillar Temple
Claimed By : Facebook Users
Fact Check : Misleading