ఫ్యాక్ట్ చెక్: బంగ్లాదేశ్ హిందువుల కోసం చేపట్టిన నిరసన ప్రదర్శనను నాగ్ పూర్ లో ఇటీవల అల్లర్ల తర్వాతి వీడియోగా ప్రచారం చేస్తున్నారు
నాగ్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖురాన్ ను దహనం చేశారనే వదంతులపై జరిగిన ఘర్షణల నేపథ్యంలో నాగ్‌పూర్‌లోని;
By - Satya Priya BNUpdate: 2025-03-20 13:45 GMT
నాగ్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖురాన్ ను దహనం చేశారనే వదంతులపై జరిగిన ఘర్షణల నేపథ్యంలో నాగ్‌పూర్‌లోని చిట్నిస్ పార్క్‌లో హింస మొదలైంది. ఆ తరువాత పరిస్థితి మరింత దిగజారింది. పోలీసులపై, స్థానికుల ఇళ్లపై కొన్ని గుంపులు రాళ్లు రువ్వడం, కార్లు, బైక్‌లను తగలబెట్టడం చేశాయి. నాగ్ పూర్ హింసకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి అని తెలిపారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. అసెంబ్లీలో ఫడ్నీవీస్ నాగ్ పూర్ లో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రత్యేకంగా మాట్లాడారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా బయటికు లాక్కొచ్చి మరీ శిక్షిస్తామని హెచ్చరించారు సీఎం ఫడ్నవీస్. ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్లు నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా పోస్టులతో సహా 140 కి పైగా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోలీసులు గుర్తించారు. వాటిని వెంటనే తొలగించాలని కోరుతూ ఈ ఖాతాలకు నోటీసులు పంపారు.
ఈ సంఘటన తర్వాత, ఛత్రపతి శివాజీని ప్రశంసిస్తూ కాషాయ రంగు జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తున్న జనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “నాగ్‌పూర్ శక్తి” అనే శీర్షికతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నాగ్‌పూర్‌లోని సకల్ హిందూ సమాజ్ మోర్చాను నిరసనలకు దిగిన పాత వీడియో ఇది.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. డిసెంబర్ 10, 2024న "సకల్ హిందూ సమాజ్ ద్వార అయోజిత్ జన్ అక్రోష్ మోర్చా ఎట్ వెరైటీ స్క్వేర్ నాగ్‌పూర్" అనే క్యాప్షన్‌తో వేదాంట్‌క్రియేషన్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అదే వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. బ్యాగ్రౌండ్ లో "సకల్ హిందూ సమాజ్" బ్యానర్‌లను చూడొచ్చు.
అదే ఖాతాలో అదే వీడియోను ‘పవర్ ఆఫ్ నాగ్‌పూర్’ అనే క్యాప్షన్‌తో డిసెంబర్ 10, 2024న షేర్ చేశారు.
“Sakal Hindu Samaj” + Nagpur” అనే కీవర్డ్‌లను ఉపయోగించి మేము సెర్చ్ చేసినప్పుడు బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నాగ్‌పూర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలకు సంబంధించిన చిత్రాలను పంచుకుంటున్న Socialnews.xyzలో ప్రచురితమైన ఒక ఫోటో కథనం మాకు లభించింది. డిసెంబర్ 10, 2024 మంగళవారం నాడు నాగ్‌పూర్‌లోని వెరైటీ చౌక్‌లో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దురాగతాలకు వ్యతిరేకంగా జరిగిన ‘జాగో హిందూ జాగో - హిందూ న్యాయ యాత్ర' లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్‌తో సహా సకల్ హిందూ సమాజ్ సభ్యులు పాల్గొన్నట్లు చిత్రాలు చూపిస్తున్నాయి.
“Nagpur Sakal Hindu Samaj Morcha : बांग्लादेशातील हिंदूंवरील अत्याचार विरोधात नागपूरात धरणे आंदोलन” అనే టైటిల్ తో డిసెంబర్ 10, 2024న ABP majha ప్రచురించిన యూట్యూబ్ వీడియోను కూడా మేము కనుగొన్నాము. వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలను మనం ఈ వీడియోలో కూడా చూడవచ్చు.
నాగ్ పూర్ లోని వరైటీ స్క్వేర్ వద్ద సకల హిందూ సమాజ్ వారు నిర్వహించిన ర్యాలీ లో వేలాది మంది పాల్గొన్నారనీ, అందులో బాంగ్లాదేశ్ లో మినారిటీలైన హిందువుల పైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా హిందూ నేతలు మోర్చా నిర్వహించారనీ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కధనం తెలుపుతోంది. కనుక, వైరల్ వీడియో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నాగ్‌పూర్‌లోని సకల్ హిందూ సమాజ్ మోర్చా చేపట్టిన నిరసన ప్రదర్శనకు సంబంధించింది.
Claim : నాగ్ పూర్ లో మత ఘర్షణలు చోటు చేసుకున్న తరువాత హిందువుల భారీ సంఖ్యలో నిరసన ప్రదర్శన చేపట్టారు
Claimed By : Instagram Users
Fact Check : Misleading