ఫ్యాక్ట్ చెక్: హిందూ మతానికి చెందిన వ్యక్తి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాపులారిటీ దక్కించుకోడానికి, కంటెంట్‌ను సృష్టించడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ;
By - Satya Priya BNUpdate: 2025-03-21 15:23 GMT
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాపులారిటీ దక్కించుకోడానికి, కంటెంట్‌ను సృష్టించడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. కంటెంట్ అంటూ చేసే పనులు కొన్నిసార్లు తీవ్ర విమర్శలకు కారణమవుతుంది. కొందరికి చిరాకు కూడా కలుగుతుంది. ఇక ఈ ఇన్ఫ్లుయెన్సర్లు హద్దులు దాటి ప్రవర్తిస్తూ ఉంటారు. వ్యూవర్ షిప్ కోసం వికృత చేష్టలు చేస్తుంటారు. కొందరు నవ్వు తెప్పించే కంటెంట్‌ను సృష్టించే ప్రయత్నంలో, తరచుగా తమ చుట్టూ ఉన్న ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. భారతదేశంలో కూడా ప్రాంక్ వీడియోల ట్రెండ్ కొనసాగుతూ ఉంది. కొందరు చేసే పనుల కారణంగా ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. 2024 సంవత్సరంలో, హైదరాబాద్‌లోని మాల్‌లో ఇతరులకు ఇబ్బంది కలిగించినందుకు హైదరాబాద్‌కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్‌పై కేసు నమోదు చేశారు. ఇక రద్దీగా ఉండే ఢిల్లీ ఫ్లైఓవర్ మధ్యలో మరొక ఇన్ఫ్లుయెన్సర్ తన కారును ఆపి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను క్రియేట్ చేసి ఇబ్బందులపాలైంది.
ఇంతలో ఒక వ్యక్తి అమ్మాయిల గుంపును వారి అనుమతి లేకుండా చిత్రీకరించి, వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అతడు ఓ హిందూ వ్యక్తి అని పేర్కొంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “Cringe alert: Desperate Hindu uncle on a mission to impress Austrian white girls in Canada… someone stop this disaster!” అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేస్తున్నారు. ఓ వ్యక్తి టేబుల్ ముందు కూర్చున్న మహిళలతో ఎలాంటి అనుమతి తీసుకోకుండా వీడియోను రికార్డు చేయడం వీడియోలో చూడొచ్చు.
అతను ఒక హిందూ అంకుల్ అనీ, తెల్లజాతి అమ్మయిలను మెప్పించే ప్రయత్నం లో ఇబ్బంది పెడ్తున్నాడనీ ఈ క్యాప్షన్ సారాంశంఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి హిందువు కాదు. మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించాం. ఆ వీడియో jacojaki21 అనే
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్లోడ్ చేశారని, ఆ సోషల్ మీడియా ఖాతా కెనడాలో ఆపరేట్ చేస్తున్నారని మేము కనుగొన్నాము..
వీడియో లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
వీడియోలో @flyme2009 అనే వాటర్ మార్క్ మాకు కనిపించింది. మరిన్ని వివరాల కోసం వెతికినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లభించింది. అందులో అతడు మతం, ఇతర అంశాల గురించి మాట్లాడే అనేక వీడియోలను అప్లోడ్ చేశాడు. ఒక వీడియోలో అతను కొందరితో వాదిస్తూ తాను నాస్తికుడిని, గతంలో ముస్లింగా ఉండేవాడినని చెప్పాడు.
మాకు మరో వీడియో కూడా దొరికింది. అందులో అతను తాను గతంలో ముస్లింగా ఉండేవాడినని, నాస్తికుడిని అని స్పష్టంగా చెబుతూ కనిపించాడు. ఇస్లాం గురించి పలువురు వ్యక్తులతో వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో వివరణలో “నేను 2001 లో ఇస్లాంను వదిలిపెట్టాను. నేను గర్వంగా నాస్తికుడిని అని చెప్పుకుంటాను. ప్రజలు మరొక మతంలోకి ఎందుకు మారుతారో నాకు అర్థం కాలేదు? ప్రాథమికంగా అన్ని మతాలు మంచి వ్యక్తిగా ఉండమని, దేవుడిని ఆరాధించమని చెబుతాయి. ముస్లింలు ఇతర మతస్థులను ఇస్లాంలోకి ఎందుకు మార్చాలనుకుంటున్నారు అనే ప్రశ్నను నేను అడగాలనుకుంటున్నాను? దేవుడు ఒకడే అయితే ఇస్లాంలోకి మారడం వల్ల ఉపయోగం ఏమిటి? ముస్లింలు క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు, హిందువులను ఇస్లాంలోకి మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తారు?” అని చెప్పడం కూడా వినవచ్చు.
కనుక, కెనడా వీధుల్లో తెల్లజాతి అమ్మాయిలతో వీడియోను రికార్డు చేస్తున్న వ్యక్తి హిందువు కాదు, అతను వీధుల్లో తిరుగుతూ వీడియోలను సృష్టించే కంటెంట్ క్రియేటర్. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : కెనడాలో ఆస్ట్రియన్ శ్వేతజాతి అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ఒక హిందూ వ్యక్తి వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Twitter users
Fact Check : False