Hyderabad : గోదారి అబ్బాయికి.. మర్యాదలు అదుర్స్
హైదరాబాద్ లోనూ గోదావరి మర్యాదలు ప్రారంభమయ్యాయి. కొత్త అల్లుడికి 130 రకాల వంటకాలు రుచి చూపించారు;
సంక్రాంతి పండగ అంటే గోదారి జిల్లాలోనే చూడాలి. ఈ మూడు రోజుల పాటు ఇక సందడి గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే సంక్రాంతి పండగకు కొత్త అల్లుళ్లకు ఆతిధ్యం అదిరిపోయేటట్లు ఇస్తారు. అత్తింటి వారి మర్యాదలతో పెట్టి చంపేస్తుంటారు. సంక్రాంతి పండగకు తొలిసారి వచ్చిన అల్లుడి కోసం అన్ని రకాల వంటలు చేస్తారు. పెళ్లయిన తర్వాత తొలి ఏడాది అల్లుడు ఇంటికి వస్తే ఇక గోదావరి జిల్లాల్లో మర్యాదలు మామూలుగా ఉండవు. సాధారణంగా కూడా గోదావరి జిల్లాలో మర్యాదలకు కేరాఫ్ అడ్రస్. అందుకే గోదావరి అల్లుళ్లు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదే మర్యాదలు ఇప్పుడు అన్ని చోట్ల విస్తరించాయి. హైదరాబాద్ లోనూ అదే రకమైన మర్యాదలు ప్రారంభమయ్యాయి.
అన్ని రకాల వంటలతో...
కాకినాడ నుంచి వచ్చిన తమ అల్లుడికి 130 రకాల పిండి వంటలను హైదరాబాద్ నగరంలో చేసి పెట్టి అత్తామామలు కొత్త అల్లుడిని అలరించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లోని శారదానగర్ లో క్రాంతి కల్పనకు ఇద్దరు కుమార్తెలు కాగా, అందులో పెద్ద కుమార్తెను కాకినాడకు చెందిన మల్లికార్జునకు ఇచ్చి నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు. అయితే తొలి పండగకు సంక్రాంతికి కొత్త అల్లుడు ఇంటికి రావడంతో అతడి కోసం 130 రకాల పిండి వంటలను సిద్ధం చేసి ఉంచారు. వివిధ రకాల స్వీట్, హాట్, పులిహోర వంటి వెజిటేరియన్ తో పాటు నాన్ వెజ్ వంటకాలను కూడా సిద్ధంచేసి వండి వార్చారు. అత్తమామల ప్రేమ చూసిన గోదారి అబ్బాయికి అదే ఏరియా మర్యాదను చవి చూపించి తమ ప్రేమను చాటుకున్నారు.