మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర మహిళ మృతదేహం
హైదరాబాదులోని మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఓ మహిళ మృతదేహం దొరికింది
హైదరాబాదులోని మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఓ మహిళ మృతదేహం దొరికింది. మహిళ మృతదేహం మూసిలో కొట్టుకొచ్చింది. నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతైన లక్ష్మీదిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించిన జీహెచ్ఎంసి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న లక్ష్మి (55) గత ఆదివారం నుండి కనిపించకుండా పోయింది. లక్ష్మి ఇంటి వెనకాలే హుస్సేన్ సాగర్ నాలా పొంగి ప్రవహిస్తుంది. లక్ష్మి ఆ నాలలోనే కొట్టుకుపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముసరాంబాగ్ బ్రిడ్జి వద్ద జీహెచ్ఎంసి చెత్త తొలగిస్తుండగా వరదనీటిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం కొట్టుకొచ్చింది.
భారీ వరద ఉధృతితో మూసీ నది ప్రవహిస్తూ ఉంది. అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వంతెనను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాలలో అలర్ట్‌గా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు. మూసీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని HMWS&SB మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ, పోలీసులను కూడా వాటర్ బోర్డు అప్రమత్తం చేసింది.