Hyderabad : హైదరాబాద్ లో కుక్కల స్వైర విహారం.. బయటకు అడుగు పెట్టాలంటే వణుకు

హైదరాబాద్ లో వీధికుక్కలు భయపెడుతున్నాయి. ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయమేసే పరిస్థితి వచ్చింది;

Update: 2024-11-03 08:23 GMT

హైదరాబాద్ లో వీధికుక్కలు భయపెడుతున్నాయి. ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయమేసే పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎక్కడ చూసినా.. ఏ వీధిలో చూసినా గుంపులు.. గుంపులు వీధికుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. బయటకు వచ్చిన వెంటనే అవి మీద పడి కరిచేస్తున్నాయి. ఒంటరిగా మహిళలు, వృద్ధులు, పిల్లలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఒకవేళ పొరపాటున వస్తే కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్నారు. దీంతో హైదరాబాద్ లో కుక్కలను పారదోలండయ్యా బాబూ అంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు. తమ వీధికి మున్సిపాలిటీ కుక్కల వ్యాన్ వచ్చి కొన్ని నెలలవుతుందని తెలిపారు.

బాలుడికి తీవ్ర గాయాలు...
వీధి కుక్కల బారిన పడి తాజాగా బోరబండలో ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎక్కువ మంది చిన్నారులు, వృద్ధులు, మహిళలు కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందేందుకు వస్తున్నారు. వందల సంఖ్యలో రోగులు వస్తుండటంతో రేబిస్ వ్యాక్సిన్ కూడా కొన్ని ఆసుపత్రుల్లో దొరకడం లేదు. బయట నుంచి తెచ్చుకోవాలంటూ ఆసుపత్రి సిబ్బంది చెబుతుండటంతో గాయపడిన వారి బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ హైదరాబాద్ లో ఈ కుక్కల దాడి ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
రాత్రి వేళలోనూ...
ఏదైనా బజారు నుంచి తెచ్చుకోవాలనుకున్నా మహిళలు భయపడిపోతున్నారు. వాటి కోసం కుక్కలు వెంటపడి తరుముతున్నాయి. ప్రతి వీధిలోనూ పదుల సంఖ్యలో వీధికుక్కలు మహిళలు, చిన్నారులపై విరుచుకుపడిన సందర్భాలు ఇటీవల కాలంలో అనేకం ఉన్నాయి. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని, కుక్కల బెడద హైదరాబాద్ నగరంలో సమస్య మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెబుతున్నారు. రాత్రి వేళ ఆ కుక్కల అరుపులతో నిద్ర కూడా పట్టడం లేదని, వీటిని ఇక్కడి నుంచి తరలించాలంటూ అనేక మంది మున్సిపల్ సిబ్బందికి మొరపెట్టుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడంతో కుక్కల బెడద హైదరాబాద్ ను పట్టుకుని వేధిస్తూనే ఉంది.


Tags:    

Similar News