పూలు.. పండ్లు అసలు కొనలేం.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. కార్తీక మాసం ఎఫెక్ట్
కార్తీక మాసం వచ్చిందంటే చాలు పూలు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి.
కార్తీక మాసం వచ్చిందంటే చాలు పూలు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. నిన్నమొన్నటి వరకూ అందుబాటులో ఉన్న పండ్లు కూడా ఇప్పుడు తినడానికి చేదుగా మారనున్నాయి. కార్తీక మాసంలో పండ్లకు, పూలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో వీటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కార్తీకమాసం ప్రారంభమయి రెండు రోజులు కావస్తుంది. ఈరోజు తొలి కార్తీక సోమవారం కావడంతో ఎక్కువ మంది ఉపవాస దీక్షలు ఉంటారు. పండ్లు, ఫలాలు తిని రాత్రికి భోజనం చేస్తారు. ఉపవాసం చేయడం మంచిదని పెద్దలు చెబుతారు. అందుకే కార్తీక మాసం మొత్తం ఉపవాసం ముఖ్యంగా మహిళలు చేయడం సంప్రదాయంగా వస్తుంది.
పండ్లు తినలేం...
అయితే ఈ సీజన్ లో పండ్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పుచ్చకాయ, యాపిల్, ఆరెంజ్ తో పాటు కమలాలు, జామకాయలు, కీరా దోస వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇక అరటి పండ్లు కూడా సీజన్ తో నిమిత్తం లేకుండా ఆహారంలో ఒక వస్తువుగా భావించేవారు అనేక మంది. ఇక ఉపవాసాలు ఉండే సమయంలో ఎక్కువ మంది పండ్లు తీసుకోవడం, ఆలయాలకు వెళ్లి పండ్లను, పూలను నైవేద్యంగా సమర్పించడం వంటివి చేయడంతో వాటికి డిమాండ్ పెరిగింది. గతంలో యాపిల్ వంద రూపాయలకు ఐదు వరకూ వచ్చేవి. కానీ నేడు సోమవారం కేవలం రెండు మాత్రమే ఇస్తున్నారు. జామ కిలో ఎనభై రూపాయలు పలుకుతుంది.
పూల ధరలకు రెక్కలు...
కిలో పుచ్చకాయ వందరూపాయలకు పైగానే ధర ఉంది. ఇక అరటిపండ్ల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. డజను అరటి పండ్లు నిన్నటి వరకూ అరవై రూపాయలు ఉండగా నేడు వందరూపాయలకు చేరుకుంది. ఆరెంజ్ లు నిన్నటి వరకూ వందకు పది వరకూ ఇచ్చేవారు. కానీ నేడు వందకు ఐదుకు మించి ఇవ్వడం లేదు. ఇకపూలు కూడా రెక్కలు విరుచుకుని మరీ ముందుకు ధరలు సాగాయి. బంతిపూలు, చేమంతులు వంటివి పావుకిలో ముప్ఫయి రూపాయలు వరకూ నేడు యాభై రూపాయల కు చేరుకుంది. గులాబీలను అసలు కొనలేని పరిస్థితి. అదేమంటే డిమాండ్ పెరిగిందని, దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద కార్తీక మాసంలో పండ్లు, పూల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.