Hyderabad : హైడ్రాను ఎమ్మెల్యేలే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
హైడ్రా ఆక్రమణ చెరువులను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది;

హైదరాబాద్ దిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆక్రమణ చెరువులను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, కాల్వలను ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తూనే ఉంది. గత ఏడాది కాలం నుంచి హైడ్రా దెబ్బకు కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూమి తిరిగి ప్రభుత్వ పరమయింది.
హైకోర్టు కూడా...
అయితే హైడ్రా నోటీసులు ఇవ్వకుండా నేరుగా నిర్మాణాలను కూల్చడంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానం కూడా దీనిని తప్పుపట్టింది. అనేక సార్లు హైడ్రాకు హైకోర్టు అక్షింతలు వేసింది. పేదలు, మధ్య తరగతి వాళ్లనే హైడ్రా టార్గెట్ చేసిందా? లేక రాష్ట్రంలో ఉన్నత వర్గాలకు ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా? అని తాజాగా హైకోర్టు ప్రశ్నించడం కొంత చర్చనీయాంశమైంది. హైడ్రా చర్యలు కొందరిపైనే ఎందుకుంటున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. ఇలా హైకోర్టు పలు దఫాలు హైడ్రా తీరును తప్పు పట్టే విధంగా వ్యాఖ్యానించింది.
ఎమ్మెల్యేల నుంచి...
దీంతో పాటు హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీనిపై వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ అయితే హైడ్రా అధికారులను హెచ్చరించారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కూల్చివేతలు చేపడితే ఊరుకోనని హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా హైడ్రా పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా అధికారులు స్పందించడం లేదని ఆయన బహిరంగ ఆరోపణలు చేశారు. దీంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.
ఎవరు అవకతవకలు పాల్పడినా...
మరో వైపు హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరించింది. అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. లేని పక్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అవకతవకలు నిజమైన పక్షంలో హైడ్రా ఉద్యోగులైతే సస్పెండ్ చేయడంతో పాటు.. కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా కాని.. పరోక్షంగా కాని హైడ్రా పేరును వినియోగించుకుని వసూళ్లకు పాల్పడినా, అవకతవకలు చేసినా వారిపైనా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురిపై కేసులు కూడా పెట్టామన్నారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తున్నట్టు ఏవైనా ఫిర్యాదులుంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తమ దృష్టికి కాని, ఏసీబీ, విజిలెన్స్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చని తెలిపారు.