ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే మరణ శిక్ష

ఉత్తరకొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొని చాలా రోజులే అవుతోంది. అక్కడి ప్రజలు సరైన తిండిలేక ప్రాణాలు కోల్పోతున్నారు.

Update: 2023-06-21 11:06 GMT

ఉత్తరకొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొని చాలా రోజులే అవుతోంది. అక్కడి ప్రజలు సరైన తిండిలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆహార సంక్షోభం నుంచి తప్పించుకునేందుకుగానూ కొందరు పొరుగుదేశం నుంచి అక్రమంగా ఆహార పదార్థాలను తెచ్చుకోడానికి యత్నించగా వారిని చంపేసింది కిమ్ జోంగ్ ఉన్ సేన. అలాంటి ప్రయత్నాలు చేసే వారిని కాల్చివేయాలని గార్డులకు ఆదేశాలిచ్చారు. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభిస్తోన్న సమయంలో ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. ఇతర దేశాల ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో ఇప్పుడు అక్కడ ప్రజలకు కావాల్సిన ఆహారం లభించడం లేదు. దీంతో ఆత్మహత్యలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. 1990ల నాటి కరువు పరిస్థితుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కోంటోంది.

ఇక ఊహించని విధంగా పెరిగిపోతున్న ఆత్మహత్యలను కట్టడి చేయాలని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యలను నిషేధించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఆత్మహత్య చర్య దేశద్రోహ చర్యతో సమానమని, అలా చేస్తే మరణశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో ఆత్మహత్యలను నివారించకపోతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు ఆ అధికారులు ఆ ప్రాంతాల్లోని ప్రజలను ఆత్మహత్యలు చేసుకోకండి అంటూ వేడుకుంటూ ఉన్నారు. ఓ సంస్థ ఇటీవల విడుదల చేసిన సర్వే ప్రకారం ఉత్తర కొరియాలో ఆత్మహత్య కేసులు అంతకు ముందు సంవత్సరం కంటే 40% పెరిగాయి. తినడానికి తిండిలేక, పేదరికం కారణంగా ఈ ఆత్మహత్యలు జరిగాయని సర్వేలో తేలింది.


Tags:    

Similar News