రోబోకు మనిషి చర్మం.. మామూలు విషయం కాదు కదా..!
ప్లాస్టిక్ రోబో వేలును ఎంతో మృదువుగా.. మనిషి చర్మకణాల మిశ్రమంలో తయారు చేశారు.
అచ్చం మనిషిని పోలిన రోబోలను తయారు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. పెద్ద మొత్తంలో డబ్బును వెచ్చిస్తూనే ఉన్నాయి. కానీ అనుకున్న దిశగా ఇంకా పూర్తిగా సక్సెస్ కాలేకపోతూ ఉన్నారు. ఎక్కడో ఒక చోట ఈ రోబోల విషయంలో సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక రోబోను అచ్చం మనిషిలాగా తయారు చేసే దిశలో భాగంగా జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు కాస్త సక్సెస్ అయ్యారనే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రోబోను మనిషి చర్మం ఉండేలా రూపొందించారు.
ప్లాస్టిక్ రోబో వేలును ఎంతో మృదువుగా.. మనిషి చర్మకణాల మిశ్రమంలో తయారు చేశారు. మూడు రోజుల తర్వాత ఇవి రోబో వేలుకు అంటుకుపోయి, మన చర్మం లోపలి పొరలాంటిది ఏర్పడింది. దీన్ని కెరటినోసైట్లనే చర్మ కణాల్లో పెట్టగా 1.5 మిల్లీమీటర్ల మందంతో చర్మం పైపొర పుట్టుకొచ్చింది. ఇది వేలు ముందుకు, వెనక్కు కదులుతున్నప్పుడు ఏమీ అవ్వలేదు. ఎక్కడైనా చీరుకుపోతే మన చర్మం మాదిరిగానే తిరిగి నయం అయింది. రక్తనాళాలు లేకపోవటం వల్ల కొంత సేపటి తర్వాత ఎండిపోయింది. చర్మం తేమగా ఉండటానికి భవిష్యత్తులో కృత్రిమ రక్తాన్ని సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
జపనీస్ శాస్త్రవేత్తలు మానవ చర్మ కణాలను ఉపయోగించి మానవ చర్మానికి సమానమైన "సజీవ చర్మం"ను రూపొందించారు. ల్యాబ్-నిర్మిత చర్మం నిజమైన మానవ చర్మం రూపాన్నీ, స్పర్శను కలిగి ఉంది. పరిశోధకులు 'మ్యాటర్ జర్నల్'లో ప్రయోగంపై పేపర్ ను ప్రచురించారు. కొల్లాజెన్ మరియు హ్యూమన్ డెర్మల్ ఫైబ్రోబ్లాస్ట్‌లను స్కిన్ సొల్యూషన్‌ను రూపొందించడానికి ఎలా మిక్స్ చేశారో వివరించారు. టోక్యో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత అయిన షోజి టేకుచి, హ్యూమనాయిడ్ రోబోట్‌లకు వాస్తవిక రూపాన్ని అందించడానికి సజీవ చర్మం పరిష్కారమని నమ్ముతున్నారు. హెల్త్‌కేర్, సర్వీస్ ఇండస్ట్రీలలో ప్రజలు హ్యూమనాయిడ్స్‌తో సంభాషించాలని శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. రోబోట్‌లు మనుషులకు మరింత చేరువయ్యేలా మార్చడానికి మానవ రూపమే ఒక ముఖ్యమైన కారకం అని వారు గుర్తించారు.