Cyclone Effect : విరుచుకుపడ్డ తుపాను ఛీడో తుపాను భారీగా ఆస్తి నష్టం.. వెయ్యి మందికిపైగా మృతి?
ఫ్రాన్స్‌లోని హిందూ మహాసముద్రంలో తుపాను బీభత్సం సృష్టించింది.
ఫ్రాన్స్‌లోని హిందూ మహాసముద్రంలో తుపాను బీభత్సం సృష్టించింది. మాయోట్ ద్వీపంపై తుపాను విరుచుకుపడటంతో సుమారు వెయ్యి మంది మరణించారని చెబుతున్నారు. హిందూ మహాసముద్రంలోని ఫ్రెంచ్ ద్వీపకల్పం మాయోట్ లో ఛీడో తుపాను విరుచుకుపడటంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు పదకొండు మృతదేహాలను బయటకు తీసినట్లు తెలిసింది. వందల సంఖ్యలో ఛీడో తుపాను పొట్టన పెట్టుకుందని అధికారులు తెలిపారు. తుపాను దెబ్బకు అనేక పట్టణాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి.
భారీగా ఆస్తినష్టం..
ఆస్తి నష్టం ఎంంతో కూడా అంచనా వేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రాణ నష్టం కూడా అధికంగా ఉండటంతో శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. అదే సమయంలో కమ్యునికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో మృతులు ఎవరో కూడా తెలియడం లేదని, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు.
మృతుల సంఖ్యపై..
అయితే ఎంత మంది ఈ తుపాను కారణంగా చనిపోయారన్నది తేల్చడానికి చాలా సమయంపట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సహాయక బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. మంచినీటి సరఫారా కూడా నిలిచిపోవడంతో ప్రజలు తాగేందుకు కూడా నీరు లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇంతటి దారుణమైన బీభత్సమైన తుపాను ను గతంలో ఎన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇంతటి విషాదాన్ని తట్టుకోలేకపోతున్నామని ప్రజలు చెబుతున్నారు. ఎంతమంది మరణించారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.