దేవిశ్రీ ప్రసాద్ కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
ఐటెం సాంగ్స్, భక్తిగీతాలు తన దృష్టిలో ఒక్కటేనంటూ.. సినిమాలోని ఐటెం సాంగ్ ను భక్తిగీతాలతో పోలుస్తూ డీఎస్పీ చేసిన వ్యాఖ్య
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు బీజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలేమైంది ? వాళ్లిద్దరికీ మధ్య గొడవేంటి ? అనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డీఎస్పీ చేసిన కామెంట్లే ఆయన్ను ఇరకాటంలో పడేశాయి. దేవిశ్రీ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. ఐటెం సాంగ్స్, భక్తిగీతాలు తన దృష్టిలో ఒక్కటేనంటూ.. సినిమాలోని ఐటెం సాంగ్ ను భక్తిగీతాలతో పోలుస్తూ డీఎస్పీ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు.
క్షమాపణలు చెప్పాల్సిందే..
దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతినేవిధంగా ఉన్నాయని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటెంసాంగ్స్ తో భక్తిగీతాలను ఏ విధంగా పోల్చుతారని ప్రశ్నించారు. ఐటెంసాంగ్స్ ను భక్తిగీతాలతో పోల్చడంతో హిందువులంతా దేవిశ్రీప్రసాద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వెంటనే అతను హిందువులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పని తరుణంలో అతను ఇక బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. దేవిశ్రీ తన తప్పు తెలుసుకుని హిందువులకు క్షమాపణలు చెప్పకపోతే.. ప్రజలు చెప్పులతో తరిమికొడతారని హెచ్చరించారు. పుష్ప సినిమా ఐటమ్ సాంగ్‌లో కొన్ని పదాలను దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండిస్తున్నామని రాజాసింగ్ అన్నారు.