మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటించిన పొలిటికల్ డ్రామా 'గాడ్ ఫాదర్' తెలుగులో మంచి బిజినెస్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి ఆరు రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ బాక్సాఫీస్ నుండి 60 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. పొలిటికల్ డ్రామా గాడ్ ఫాదర్ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ సినిమాకి తెలుగు రీమేక్.
మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులు దాదాపు రూ. 92 కోట్లకు అమ్ముడయ్యాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్ సంపాదించడానికి ఇంకాస్త పోరాడాల్సి ఉంది. ఇక ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ పాత్రలో కనిపించడంతో తప్పకుండా సినిమాను థియేటర్లలో చూస్తారని అనుకున్నారు. అయితే అక్కడ ఆశించినంత రెస్పాన్స్ దక్కడం లేదు. గాడ్ ఫాదర్ నార్త్ బెల్ట్ నుండి 6 రోజుల్లో రూ 4.25 కోట్లు వసూలు చేసింది. చిరంజీవి నటించిన ఈ సినిమా హిందీ బెల్ట్‌లో డిజాస్టర్‌గా మారిందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో ఈ నెల 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ చూశారని మోహన్ రాజా చెప్పుకొచ్చారు. సినిమా కంటెంట్‌ను అభినందించారని తెలిపారు. 'ఆచార్య' ఫ్లాప్ తరువాత మెగాస్టార్ 'గాడ్ ఫాదర్'తో హిట్ కొట్టడంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంలో ఉన్నారు.