Revanth Reddy : తలొగ్గితే....తలతీసినట్లవుతుంది భయ్యా?

టాలీవుడ్ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.

Update: 2024-12-26 06:40 GMT

టాలీవుడ్ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో టిక్కెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలను అనుమతించబోమని రేవంత్ రెడ్డి తెగేసి చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో ప్రజాసేవా కార్యక్రమాల్లో పాటు అవగాహన పెంచేందుకు సినిమా ఇండ్రస్ట్రీ కృషిచేయాలని రేవంత్ రెడ్డి సినీ పెద్దలను కోరినట్లు సమాచారం. డ్రగ్స్ ను అరికట్టేందుకు అందరూ కలసి నడుంబిగించాలని ఆయన కోరారు. అదే సమయంలో విద్యారంగం అభివృద్ధికి కూడా సినీ రంగం ప్రభుత్వానికి చేయూత నివ్వాలని కోరినట్లు తెలిసింది. అంతే తప్ప బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపు ఉండబోదని ఆయన స్పష్టం చేసింది. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ తాము లక్ష్యంగా చేసుకోలేదని, సంఘటన తీవ్రత దృష్ట్యా పోలీసులు చర్యలు తీసుకుంటారని సినీ పెద్దలకు రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది.

పెద్ద సంఖ్యలో హాజరై...
టాలీవుడ్ పెద్దలు ఇంత పెద్ద సంఖ్యలో హాజరు కావడం చూస్తేనే అర్ధమవుతుంది. దాదాపు 36 మంది టాలీవుడ్ నుంచి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎంత ఆందోళన చెందుతున్నారో. టిక్కెట్ల ధరల పెంపు చేయమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వనంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో టాలీవుడ్ షేక్ అయిందనే చెప్పాలి. నిజానికి బెనిఫిట్ షోలు ఎవరి బెనిఫిట్ కు అన్న వాదన బలంగా వినిపిస్తుంది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలోనే బెనిఫిట్ షోలు వేసేవారు. ఆ షోల ద్వారా అదనంగా సమకూరిన ఆదాయాన్ని ప్రజోపయోగకార్యక్రమాలకు ఉపయోగించేవారు. అలాగే దివిసీమ తుపాను సమయంలోనూ బెనిఫిట్ ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు.
డబ్బులు దండుకోవడానికే...
కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. స్క్రీన్ల సంఖ్య పెంచుకుని, టిక్కెట్లు ధరలను ప్రభుత్వం చేత అమాంతంగా పెంచుకుని నిర్మాతలు, పరిశ్రమ వర్గాలు తమ జేబులు మాత్రమే నింపుకుంటున్నాయి. ఎలాంటి ప్రజా ప్రయోజనాలకు వాటిని వినియోగించడం లేదు. కేవలం వందల కోట్లు పెట్టి సినిమాలు తీయడం, వారం రోజుల్లో కలెక్షన్లు దండుకోవడం కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్ కు ఎండ్ కార్డు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో వైసీపీ హయాంలో జగన్ కూడా సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ మొత్తం వ్యతిరేకించింది. తాడేపల్లికి టాలీవుడ్ క్యూ కట్టారు. తమకు నష్టం వాటిల్లుతుందని బోరుమని ఆయన వద్ద విలిపించి కొంత వరకూ మినహాయింపులు పొందగలిగారు.
సేవా కార్యక్రమాల్లో...
ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదేనన్న వాదన సామాన్య ప్రజల్లో నెలకొంది. సినిమాల ద్వారా కోట్లు దండుకుంటూ కనీసం ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమంలో సినీనటులు పాల్గొనకపోవడాన్ని కూడా తప్పు పడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాత్రం జోరుగా పాల్గొంటూ కనీసం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉండేవారిని ఏమనాలన్న కామెంట్స్ వినిపడుతున్నాయి. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి తో జరిగిన సమావేశంలో శాంతిభద్రతల సమస్య విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, అదే సమయంలో టాలీవుడ్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. బౌన్సర్ల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, డ్రగ్స్, మహిళభద్రతకు సినీ పరిశ్రమకు సహకరించాలని రేవంత్ రెడ్డి టాలీవుడ్ ను కోరినట్లు తెలిసింది. ధరల పెంపుదల, బెనిఫిట్ షోలపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఇప్పుడు లేదని సమాచారం.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


 


Tags:    

Similar News