సినీ నటుడు మంచు మోహన్ బాబుకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. జల్పల్లి తన ఇంటిలో మీడియాపై జరిగిన దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయింది. అయితే తాను అనారోగ్యంతో ఉన్నానని, గుండె నరాల సంబంధ సమస్యలతో బాధపడుతున్నానని తెలిపారు. అయితే ఆయన తిరుపతిలో ఉన్నారని, ఇటీవల దుబాయ్ లో తన మనవడిని చూసేందుకు కూడా మోహన్ బాబు వెళ్లి వచ్చారని, తిరుపతి వెళ్లి విద్యాసంస్థల బాధ్యతలను చూసుకుంటున్నారని, దాడి ఘటనలో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టు తీర్పుతో...
అయితే మోహన్ బాబు అరెస్ట్ చేస్తారా? లేదా? అన్న దానిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. మోహన్ బాబు టాలీవుడ్ లో సీనియర్ నటుడు. 78 ఏళ్ల వయసున్న మోహన్ బాబు మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా. ఎన్టీఆర్ కు వీరాభిమాని. అదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మోహన్ బాబును అరెస్ట్ చేస్తుందా? లేదా? అన్న దానిపై నెట్టింట పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అదే సమయంలో మీడియాపై జరిగిన దాడి కావడంతో ప్రభుత్వం సీరియస్ గానే ఈ కేసును తీసుకుంటుందని చెబుతున్నారు. నిన్న డీజీపీ జితేందర్ కూడా చట్ట ప్రకారం మోహన్ బాబుపపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నందున చర్యలు తీసుకోలేకపోతున్నామని తెలిపారు.
అల్లు అర్జున్ తరహాలోనే...
అయితే ఇప్పుడు హైకోర్టు ముందస్తు బెయిల్ కొట్టివేయడంతో మోహన్ బాబును అరెస్ట్ చేయాలని జర్నిలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఇటీవల అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యాయత్నం కేసు నమోదయిన మోహన్ బాబును చూసీ చూడనట్లు వదిలేస్తే ప్రభుత్వంపై మచ్చ పడే అవకాశాలున్నాయి. ఇప్పటికీ మోహన్ బాబు తిరుపతిలో ఉన్నారని చెబుతున్నారు. మోహన్ బాబును ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిష్పక్ష పాతంగా వ్యవహరించిందని నిరూపించుకోదలచుకుంటే మాత్రం మోహన్ బాబు ను ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. న్యాయస్థానానికి క్రిస్మస్ సెలవులు వస్తుండటంతో మరి మోహన్ బాబు విషయంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now