నాన్న చాలా ప్రశాంతంగా వెళ్లిపోయారు.. ఆ మూడంటే చాలా ఇష్టం : రవిబాబు
రీల్ లైఫ్ లో ఆయన ఎన్నో నెగిటివ్ రోల్స్ చేసినా.. నిజజీవితంలో చాలా పాజిటివ్ గా ఉంటారని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో తన..
ప్రముఖ టాలీవుడ్ నటుడు, తన తండ్రి చలపతి రావు మరణంపై నటుడు, దర్శకుడు రవిబాబు స్పందించారు. అందరూ అనుకున్నట్టు చలపతిరావు కన్నుమూసింది ఆదివారం తెల్లవారుజామున కాదు.. శనివారం రాత్రి 8.30 గంటలకు ఆయన తనువు చాలించారని రవిబాబు తెలిపారు. 'నిన్న రాత్రి 8.30 గంటలకు నాన్నగారు కన్నుమూశారు. ఆయన జీవితంలో ఎలా హ్యాపీగా ఉన్నారో, అందరినీ ఎలా నవ్విస్తూ ఉండేవారో అలానే ప్రశాంతంగా వెళ్లిపోయారు. భోజనం చేసి, చికెన్ కూర, చికెన్ బిర్యాని తిన్నారు. ఆ ప్లేట్ ను ఇచ్చి వెనక్కివాలిపోయారు. అంత సింపుల్ గా, హ్యాపీగా వెళ్లిపోయారు. ఈ రోజే అంత్యక్రియలు నిర్వహిద్దామనుకున్నాం. కానీ, మా సిస్టర్స్ అమెరికాలో ఉన్నారు. వాళ్లు రావడానికి టైం పడుతుంది. మంగళవారం మంచి రోజు కాదు కాబట్టి బుధవారం నిర్వహిస్తాం' అని రవిబాబు మీడియాకు తెలిపారు.
రీల్ లైఫ్ లో ఆయన ఎన్నో నెగిటివ్ రోల్స్ చేసినా.. నిజజీవితంలో చాలా పాజిటివ్ గా ఉంటారని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో తన తండ్రి ఎంతో మందికి సాయం చేశారని, ఆ విషయం కుటుంబంలో ఎవ్వరికీ తెలిసేది కాదన్నారు. తాను పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాతే తన తండ్రి వ్యక్తిత్వమేమిటో పూర్తిగా తెలిసిందన్నారు. తన తండ్రికి సీనియర్ ఎన్టీఆర్, ఆహారం, హాస్యం.. ఈ మూడంటే చాలా ఇష్టమని పేర్కన్నారు. ఎలాంటి బాధ లేకుండా.. ఒక్క క్షణంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని రవిబాబు తెలిపారు. చివరిగా చలపతి తన కొత్త సినిమాలో నటించారని, ఐదురోజుల క్రితమే ఆ షూటింగ్ జరిగిందన్నారు.