డిస్ క్లెయిమర్ లో రామాయణం కాదంటే నమ్మేస్తారా ? : అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
ఆదిపురుష్ సినిమాలో కీలక పాత్రలను చిత్రీకరించిన తీరుపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆదిపురుష్ పై నిషేధం విధించాలని..
జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ పై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి కూడా రాకుండా బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ అసోసియేషన్ ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆదిపురుష్ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేసింది. "సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, ఆంజనేయుల పాత్రలను చూపించి.. డిస్ క్లెయిమర్ లో రామాయణం కాదని చూపిస్తే జనాలు నమ్మేస్తారా ? హిందువులు క్షమాగుణం ఉన్నవారని ప్రతీసారి వారి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారు ? సభ్యత చూపుతూ సహనంగా ఉంటున్నారు కదా అని అణచివేతకు దిగడం సరేనదేనా?" అని ప్రశ్నించింది.
ఆదిపురుష్ సినిమాలో కీలక పాత్రలను చిత్రీకరించిన తీరుపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆదిపురుష్ పై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న లఖ్ నవూ ధర్మాసనం.. ఆదిపురుష్ హిందీ డైలాగ్స్ రైటర్ మనోజ్ ముంతశిర్ ను ఇంప్లీడ్ చేయాలన్న దరఖాస్తును ఆమోదిస్తూ.. ఆయనకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సినిమా ప్రారంభంలో రామాయణంతో సంబంధం లేదని ప్రదర్శించిన డిస్ క్లెయిమర్ ను ఆమోదించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. రామాయణంలో కనిపించే పాత్రలన్నింటినీ చూపించి.. రామాయణం కాదని డిస్ క్లెయిమర్ ప్రదర్శిస్తే ఎలా నమ్ముతారని ప్రశ్నించింది. ఆదిపురుష్ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది రంజన అగ్నిహోత్రి వాదనలు వినిపించారు. ఇది వాల్మీకి రామాయణం కాదు.. తులసీదాసు విరచిత రామచరిత మానస్ కూడా కాదని కోర్టుకు తెలిపారు.
అయితే.. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీచేసిన ధృవపత్రాన్ని పునః సమీక్షించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందో లేదో చెప్పాలని డిప్యూటీ సొలిసటర్ జనరల్ ఎస్ బీ పాండేను ధర్మాసనం కోరింది. 1952 చట్టంలోని సెక్షన్ 6 కింద కేంద్రం తనకున్న పునః సమీక్ష అధికారాలను ఉపయోగించి తగిన చర్యలు తీసుకుంటుందో లేదో కోర్టుకు తెలపాలని ఆదేశించింది. నేడు తదుపరి విచారణ కొనసాగనుంది.