వరదల బీభత్సం.. 8 రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

ఉత్తరాఖండ్ లో ఓ కారు గంగానదిలో పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో..

Update: 2023-07-09 12:37 GMT

north india floods

భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను కూడా వణికిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో 40 ఏళ్ల తర్వాత భారీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో గౌహతి సహా పలు ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉండటంతో.. అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాల ధాటికి ఇప్పటివరకూ 12 మంది మరణించారు. 20 రైళ్లు రద్దయ్యాయి.

ఉత్తరాఖండ్ లో ఓ కారు గంగానదిలో పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు ఐదుగురు మృతి చెందారు. జమ్మూ-కశ్మీర్ లో దోడా ప్రాంతాల్లో బస్సుపై కొండచరియలు విరిగి పడటంతో ఇద్దరు మృతి చెందారు. పూంచ్ లో శనివారం ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సుబేదార్ కుల్ దీప్ సింగ్, సిపాయి తెలూ రామ్ లుగా గుర్తించారు.
ప్రముఖ పర్యాటక కేంద్రమైన మనాలీలో పార్కింగ్ ఉన్న కార్లు వరద ప్రవాహంలో బొమ్మల్లా కొట్టుకుపోయాయి. మండీ జిల్లాలో ఔట్- బంజార్ ప్రాంతాలను కలుపుతూ బియాస్ నది పై నిర్మించిన ఉక్కు వంతెన సైతం వరదలో కొట్టుకుపోయింది. మొత్తం 36 ప్రాంతాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. మండీ-కుల్లూ, మనాలీ - లేహ్, చంబా - పఠాన్ కోట్ తదితర జాతీయ రహదారులు సహా 700కుపైగా రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. కుల్లూ జిల్లాలో బియాస్ నదీతీరం నుంచి ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలో విద్యాసంస్థలకు రెండురోజులు సెలవులు ప్రకటించారు. జమ్ము -కశ్మీర్ లో వరద తాకిడికి ఎన్ హెచ్ -44 పలు చోట్ల ధ్వంసమైంది.
జమ్ము కశ్మీర్, ఢిల్లీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, లక్షద్వీప్ లకు ఐఎండీ భారీ వర్షసూచన చేసింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతానికి వర్షం తెరపించినా.. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కేరళలోని మలప్పురం, కోజికోడ్, మయనార్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, మూడు జిల్లాలకు రాబోయే రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు తెలంగాణలోనూ జులై 13 వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. జులై నెలలో వర్షపాతం ఎక్కువగా నమోదుకావచ్చని ఐఎండీ అభిప్రాయపడింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.




Tags:    

Similar News