అలర్ట్ : కేసులు పెరుగుతున్నాయ్
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈరోజు రాష్ట్రాల అధికారులతో కేంద్ర అధికారలు సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. ఇప్పటికే భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా 1590 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం కూడా కొంత ఆందోళన రేకెత్తిస్తుంది. దీంతో టెస్టింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అలర్ట్ చేసింది.
నేడు సమావేశం....
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగానే కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు రంగంలోకి దిగుతుంది. ప్రధానంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాలను ప్రత్యేకంగా హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనాలో కొత్త వేరియంట్ XXB కొంత ఆందోళన కలిగిస్తుంది. వైరస్ తన వెర్షన్ మార్చుకుని కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందడంపై వైద్య నిపుణులు కూడా ఆందోళన చెందుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాల రోగులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.