Tamilnadu : వణికిపోతున్న తమిళనాడు.. ఇవేం తుపాన్లురా బోబోయ్
తమిళనాడుకు తుపాన్లు దెబ్బతీస్తున్నాయి. వరస తుపాన్లతో తమిళనాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
తమిళనాడుకు తుపాన్లు దెబ్బతీస్తున్నాయి. వరస తుపాన్లతో తమిళనాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలతో నిత్యం తమిళనాడులో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సతమతమవుతున్నారు. ఇటీవల వరస తుపాన్లు తమిళనాడును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. తమిళనాడులో తాజా ఫెంగల్ తుపాను తీరం దాటుతుందని తెలియడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా పునరావాస కేంద్రాలకు తరలి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు తీర ప్రాంతంలో ఉన్న వారితో పాటు లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ముఖ్యమంత్రి అత్యున్నత సమావేశం...
ఈ రాత్రికి ఫెంగల్ తుపానుగా మారి ఈ నెల 29వ తేదీన తమిళనాడులోనే తీరం దాటుతుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నతాధికారులతో సమావేశమై ఫెంగల్ తుపాన్ పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఎక్కడా ప్రాణాపాయం లేకుండా చూడాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తమిళనాడులోని నాగపట్నం వద్ద సముద్రం పది మీటర్లు వెనక్కు వెళ్లింది. మత్స్యకారులను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తమిళనాడులోని పన్నెండు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండగా, ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
ఆలయాలకు తగ్గిన రద్దీ...
వరస తుపాన్లు తమిళనాడు ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. టూరిజంపై కూడా తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళనాడులో ఎక్కువగా టెంపుల్ టూరిజం ఉంది. అనేక దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. అయ్యప్ప సీజన్ కావడంతో ఎక్కువ మంది స్వాములు తమిళనాడులో ఆలయాలను సందర్శించి అటు నుంచి కేరళకు వెళుతుంటారు. ఇప్పుడు తుపాను ప్రభావంతో తమిళనాడుకు వెళ్లకుండా నేరుగా కేరళకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు పడనుండటంతో రైళ్లు కూడా రద్దయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.