Cyclone Alert : ఏపీకి తుపాను ముప్పు.. మరో మూడు రోజులు కష్టమేనా?

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాను గా మారనుంది;

Update: 2024-11-27 03:53 GMT

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాను గా మారనుంది. దీంతో ఏపీ, తమిళనాడుకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపానుకు ఫెంగల్ గా నామకరణం చేశారు. అత్యంత వేగంగా దూసుకువస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఈ రెండు రాష్ట్రాలకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు...
ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, రాష్ట్రాలను వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. ఈ రెండు రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్, ఆంధ్రప్రదేశ్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులో ఈ నెల 29వ తేదీన తుపాను తీరం దాటే అవకాశముందని పేర్కొంది. నాగపట్నం సమీపంలోనూ, పుదుచ్చేరికి దగ్గరలోనూ ఈ తుపాను కేంద్రీకృతమయిందని అధికారులు చెబుతున్నారు. చెన్నై నగరం కూడా ఈ తుపాను దెబ్బకు విలవిలలాడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ అధికారులు తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంత ప్రజలకు హై అలెర్ట్ జారీ చేశారు. అయితే మధ్యలో దిశమార్చుకునే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.
మత్స్యకారులకు చేపలవేట...
తుఫాన్ ఫెంగల్ ప్రభావంతో నవంబర్ 30వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలు అయిన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడనున్నాయి. రైతులు అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. కోతలు ఉంటే వెంటనే పనులు చేసుకోవాలని.. కల్లాల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నవంబర్ 29వ తేదీ వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని మత్స్యకారులు.. సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరం వెంట 50 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.



Tags:    

Similar News