Aravind Kejrival : రియల్ పొలిటీషియన్‌కు... ఇది కదా? కావాల్సింది
అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సవాల్ విసిరారు. తాను ఎన్నికలకు రెడీ అంటూ రాజీనామాకు సిద్ధమయ్యారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ .జనతా పార్టీకి సవాల్ విసిరారు. తాను ఎన్నికలకు సిద్ధమంటూ ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే తన నిజాయితీని నిరూపించుకోవాలంటే మరోసారి ప్రజల వద్దకు వెళ్లడమే మార్గమని ఆయన నమ్మడం నిజంగా రాజకీయ నేతలకు నిండుదనం ఇచ్చే అంశంగానే చూడాలి. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయనకు పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే ఎన్నికలకు వెళతానని చెప్పడం, ఎన్నికలు జరిగేంత వరకూ తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండనని చెప్పడం, తన స్థానంలో ఎన్నికల వరకూ వేరే ముఖ్యమంత్రి ఉంటారని ఆయన ప్రకటించడం నిజంగా భారతీయ ప్రజాస్వామ్యానికి ఒక దారి చూపినట్లే అవుతుంది.
నేటి తరం రాజకీయ నేతలకు...
నిర్దోషిగా తాను నిరూపించుకునేంత వరకూ పదవిలో కొనసాగనని ఆయన చెప్పి నేటితరం రాజకీయ నేతలకు ఒక సవాల్ విసిరారు. ఈరోజుల్లో మరికొంత కాలమయినా తాను ముఖ్యమంత్రి పదవిగా ఉండాలని కోరుకుంటారు. అసలు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ అరంగేట్రమే ఆశ్చర్యకరమైన రీతిలో జరిగింది. అవినితీకి వ్యతిరేకంగా నాడు అన్నా హజారేతో కలసి ఉద్యమం చేసి చివరకు రాజకీయ పార్టీతోనే మార్పు సాధ్యమని నమ్మిన కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అప్పటి వరకూ ఢిల్లీ పీఠాన్ని తన సొంతం చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ను మట్టి కరిపించి 2013లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అయితే అప్పుడు బీజేపీ సహకారం తీసుకోవాల్సి రావడం, ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఆయన అధికారంలోకి వచ్చిన 49 రోజులకే ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి ప్రజల వద్దకు వెళ్లారు.
మూడుసార్లు ముఖ్యమంత్రిగా...
2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీని ఒంటరిగా అధికారంలోకి తేగలిగారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో ఉన్న 70 స్థానాల్లో ఆమ్ ఆద్మీపార్టీ 67 స్థానాల్లో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించారు. తిరిగి 2020 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 62 స్థానాల్లో నెగ్గి మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించిన అరవింద్ కేజ్రీవాల్ పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆ సంస్కరణలే పొరుగున ఉన్న పంజాబ్ లో ఆమ్ ఆద్మీపార్టీని అధికారంలోకి తెచ్చిందంటారు. అలాంటి కేజ్రీవాల్ పై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో మద్యం పాలసీలో ఆయన పార్టీ ముడుపులు స్వీకరించిందన్న ఆరోపణలతో తీహార్ జైలుకు వెళ్లారు. తనను అన్యాయంగా ఇరికించారంటూ ఆయన చేసిన వాదనలు న్యాయస్థానం నాలుగు గోడల మధ్యనే నిలిచిపోయాయి. అయితే ఆయన తప్పు చేశారా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఆయన ప్రజల ముందుకు వెళ్లి తీర్పును కోరడం అభినందనీయమే.
మరో ఏడాది ....
అందుకే అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇంకా నెలల సమయం ఉండగానే పదవి నుంచి తనకు తానే దిగిపోతానని ప్రకటించడం మాత్రం ప్రత్యర్థి పార్టీలకు కూడా మింగుడుపడకుండా ఉంది. బెయిల్ నుంచి విడుదలయిన తర్వాత తిరిగి ఎన్నికలకు వెళతానని ఆయన సవాల్ విసరడం మాత్రం నిజంగా రాజకీయాల్లో అందరికీ ఆదర్శమేనని చెప్పాలి. తాను ప్రజల నుంచే మళ్లీ తిరిగి ఎన్నికై తన పదవిని పొందుతానన్న ఆయన విశ్వాసం ఉంది చూడండి.. అది దమ్మున్నోడు చేసే పని. ప్రజా తీర్పును గౌరవించడం అంటే ఇదేనన్నది ప్రతి రాజకీయ నేత నేర్చుకోవాల్సిందే. అందుకు కేజ్రీవాల్ ఒక మార్గం చూపినట్లయింది. ఈరోజుల్లో ఇలాంటివి సాధ్యమేనా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు కేజ్రజీవాల్. మరి ప్రజాతీర్పు ఎలా ఉన్నా ఆయన చూపిన సాహనం.. తీసుకున్న నిర్ణయం, తెగువకు మాత్రం అభినందించి తీరాల్సిందే.