Kejriwal : కేజ్రీవాల్‌కు ఆరు రోజుల కస్టడీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించింది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. తమకు పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. ఈ స్కామ్ వంద కోట్లరూపాయలకు పరిమితం కాలేదని, ఆరు వందల కోట్ల కుంభకోణమని, దీనిపై కేజ్రీవాల్ ను కల్వకుంట్ల కవితతో కలసి విచారించాలని ఈడీ తరుపున న్యాయవాది కోరారు.
28న తిరిగి కోర్టు కు...
దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు ను రిజర్వ్ చేసి తర్వాత ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఆరు రోజుల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి ఇస్తున్నట్లు తీర్పు చెప్పారు. తిరిగి ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఈడీ అధికారులను ఆదేశించారు. దీంతో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి తరలించారు. నేటి నుంచి ఆయన విచారణ ప్రారంభం కానుంది. లిక్కర్ పాలసీపై కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నారు.