ఇస్రో ఖాతాలో 'కమర్షియల్' విజయం

ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న షార్‌ నుంచి పీఎస్‌ఎల్వీ- సీ56 రాకెట్‌ నింగిలోకి

Update: 2023-07-30 02:18 GMT

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం దక్కింది. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 90వ స్పేస్ మిషన్ కావడం గమనార్హం. ఈ ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీని ప్రయోగించారు. షార్ లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగాన్ని చేపట్టారు. పీఎస్ఎల్వీ వాహక నౌకకు సంబంధించి ఈ ఏడాది ఇది రెండో ప్రయోగం కాగా మొత్తం మీద పీఎస్ఎల్వీ సిరీస్ లో 58వ మిషన్ ఇది.

ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న షార్‌ నుంచి పీఎస్‌ఎల్వీ- సీ56 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను భూ కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్యం ఉపగ్రహ ప్రయోగం. సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువున్న 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. ఇందులో డీఎస్‌-సార్‌ (DS-SAR) ప్రధానమైన శాటిలైది. ఇది సింగపూర్‌ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను తీసి పంపిస్తుంది.
ప్రయోగం విజయవంతమయిన తర్వాత శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రయోగం విజయవంతం అయిందని, రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించామని చెప్పారు. సెప్టెంబర్ లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్నారు.


Tags:    

Similar News