సెక్స్ వర్కర్లకు ఊరట.. వారిని వేధిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

సెక్స్ వర్కర్ల వివరాలను ప్రచురించే విషయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తగుమార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు..

Update: 2022-05-26 06:28 GMT

న్యూ ఢిల్లీ : సెక్స్ వర్కర్లను సమాజంలో ఎంత చిన్నచూపు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు చేసే పని గురించి పదే పదే మాట్లాడి బాధపెడుతుంటారు. పోలీసులు కూడా సెక్స్ వర్కర్లంటే.. అదోరకంగా చూస్తారు. వాళ్లు పుట్టిందే ఆ పని చేయడం కోసం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. సెక్స్ వర్కర్ల పట్ల కనబరిచే తీరుపై సుప్రీంకోర్టు స్పందించింది. ఇకపై సెక్స్ వర్కర్లను ఏ విధంగానూ వేధించరాదని సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

హోటళ్లు, దాబాలు, లాడ్జిలు వంటి వాటిపై దాడులు నిర్వహించిన సమయంలో సెక్స్ వర్కర్లు పట్టుబడినా.. వారి ఫొటోలు, వివరాలను మీడియాకు ఇవ్వరాదని, మీడియా కూడా సెక్స్ వర్కర్ల ఫొటోలు, వివరాలను ప్రచురించరాదని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సెక్స్ వర్కర్ల ఫొటోలను, వారి గుర్తింపును తెలియజేసే వివరాలను వెల్లడించినా.. వారిపై 354 సీ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సమాజంలో అందరి లాగే.. సెక్స్ వర్కర్లకు కూడా కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొంటూ.. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది.
సెక్స్ వర్కర్ల వివరాలను ప్రచురించే విషయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తగుమార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆర్టికల్ 142ని అనుసరించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు.. కానీ వ్యభిచార గృహాల్లో స్వచ్ఛందంగా ఉంటున్న సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయడం, శిక్షించడం వంటివి చేయకూడదని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. అలాగే సెక్స్ వర్కర్ లైంగిక దాడికి గురైతే.. సెక్షన్ 357సీ ప్రకారం తక్షణమే వైద్య సేవలు అందించాలి.
యూఐడీఏఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్ ను అనుసరించి సెక్స్ వర్కర్లందరికీ ఆధార్ కార్డు జారీ చేయాలని, వారిని ఎక్కడా సెక్స్ వర్కర్ గా పేర్కొనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఐటీపీఏ (ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్) సంరక్షణ గృహాల్లో సర్వే నిర్వహించాలని, ఆ సర్వేలో మహిళలను బలవంతంగా నిర్భంధించినట్లు నిర్థారణ అయితే.. నిర్థిష్టగడువులోగా వారిని విడిపించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది.
కొత్తగా వచ్చిన ఐపీసీ 354సీ సెక్షన్ కింద ఇతరుల లైంగిక కార్యకలాపాలను చూడటాన్ని నేరంగా పరిగణిస్తారు. అందుకే ఈ సెక్షన్ ను ఎలక్ట్రానిక్ మీడియాపై కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశం. రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్స్ వర్కర్లు, ఇతరుల ఫొటోలు, వివరాలను ప్రసారం చేయడం పూర్తిగా నిషేధమని సుప్రీం తెలిపింది. తమ ఆరోగ్యం, భద్రత కోసం సెక్స్ వర్కర్లు తమ వద్ద కండోమ్ వంటి వాటిని దగ్గర ఉంచుకోవడం సహజం. వాటిని చూసి నేరంగా పరిగణించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.


Tags:    

Similar News