కళ్లముందే కాలిపోతున్నా.. కాపాడలేకపోయాం

బస్సులో మంటల్లో చిక్కుకున్నవారు సాయం చేయాలంటూ పిలిచారని, అక్కడి వెళ్లే సరికే అంతా మంటలు వ్యాపించాయని..

Update: 2023-07-01 06:28 GMT

మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదం.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా.. బస్సులు మంటలు చెలరేగడంతో 25 మంది సజీవదహనం అయ్యారు. కళ్లుతెరిచి ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారంతా సజీవ సమాధి అయ్యారన్న వార్తలు ప్రజలను కలచివేస్తున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదాల్లో ఇదీ ఒకటి. బుల్దానా జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో.. కొందరు మాత్రం బస్సు కిటికీలు పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. బస్సు టైరు పేలిపోవడంతో.. అది డివైడర్ ను ఢీ కొట్టినట్లు తెలిపారు. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో.. అందరూ కాపాడాలని ఆర్తనాదాలు చేశారన్నారు. తాము బస్సు వెనుక సీట్లలో ఉండటంతో.. వెనుక వైపు కిటికీలను పగులగొట్టి బయటపడినట్లు తెలిపాడు. స్థానిక వ్యక్తి మాట్లాడుతూ.. బస్సులో మంటల్లో చిక్కుకున్నవారు సాయం చేయాలంటూ పిలిచారని, అక్కడి వెళ్లే సరికే అంతా మంటలు వ్యాపించాయని తెలిపాడు. బస్సు టైర్లు విరిగి దూరంగా పడి ఉండగా.. కొందరు అద్దాలు పగుల గొట్టి బయటపడేందుకు ప్రయత్నించినా వీలుకాలేదన్నారు. బస్సు ఒకవైపుకి పడిపోవడమే అంతమంది సజీవ దహనానికి కారణమైందన్నారు.
కాపాడాలని వాళ్లు అడుగుతున్నా.. ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. కళ్లముందే కాలిపోతున్నా.. కాపాడలేకపోయామన్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులెవరూ ప్రమాదాన్ని చూసి స్పందించలేదని, వాళ్లంతా సహాయం చేసి ఉంటే.. కొందరినైనా ప్రాణాలతో కాపాడగలిగేవారమని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ఉండగా.. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.


Tags:    

Similar News