BJP : బీజేపీలో పోరు... ఆరంభం.. నిజంగా వీరి మాట పార్టీ అధినాయకత్వం వింటుందా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

Update: 2023-12-31 12:44 GMT

ap politics

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీలో కొందరు టీడీపీతో పొత్తును కోరుకుంటుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ రెండు గ్రూపులు ఏపీలో ఉన్నాయి. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇవి మరింత ముదిరాయనే చెప్పాలి. టీడీపీతో పొత్తు పెట్టుకుని శాసనసభలో కాలుమోపడమే కాకుండా.. లోక్‌సభ స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో విజయం సాధించవచ్చని ఒక వర్గం వాదిస్తుంటే... ఇక పొత్తుల కారణంగానే టీడీపీ రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేసిందని, మరో సారి ఆ తప్పిదం చేస్తారా? అంటు మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

సభలో అడుగుపెట్టాలని...
ఇప్పుడు ఏపీ బీజేపీలో రెండు వర్గాలుగా విడిపోయిన మాట వాస్తవం. ఎవరికైనా.. తాము గెలవాలని ఉంటుంది. శాసనసభలోనో, పార్లమెంటులోనో కాలు మోపాలని ఖచ్చితంగా భావిస్తారు. ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయ్యేకంటే పొత్తులతో వెళ్లడం తెలివైన వారి పని అని ప్రధానంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధ్రీశ్వరి భావిస్తున్నారు. పురంధ్రీశ్వరితో పాటు సీఎం రమేష్, సుజనా చౌదరితో పాటు మరికొందరు నేతలు పొత్తును స్వాగతిస్తున్నారు. తమ అభిప్రాయాలను ఇప్పటికే పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలిసినట్లు సమాచారం. పొత్తులతో లోక్‌సభలో బీజేపీ స్థానాల సంఖ్యను పెంచుకోవచ్చని కూడా వీరు సూచిస్తున్నారు.
వీళ్ల వాదన మాత్రం...
అదే సమయంలో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు విష్ణువర్థన్ రెడ్డి లాంటి నేతలు పొత్తుకు విముఖంగా ఉన్నారు. పొత్తు పెట్టుకోవడం వల్లనే ఇప్పటి వరకూ స్వయంగా ఎదగలేకపోయామని చెబుతున్నారు. టీడీపీని నమ్మి దాని పంచన చేరడం మూర్ఖత్వపు చర్యగా వీరు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఎన్నిసార్లు చంద్రబాబు తమతో పొత్తు పెట్టుకుని కటీఫ్ చెప్పలేదు? నేరుగా కేంద్ర నాయకులపైనే విమర్శలకు దిగిన సంగతిని ఎలా మర్చిపోతామంటూ వారు ఫైర్ అవుతున్నారు. పొత్తు లేకుండా మనం ఎదిగేందుకే పనిచేయాలని, ఆ దిశగానే కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని ఒకవర్గం కోరుతున్నారు. టీడీపీలో కూడా రెండు రకమైన బ్యాచ్‌‌లున్నాయి. కొందరు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని, మరికొందరు వద్దనే వారు కూడా ఉన్నారు.
పొత్తు ఖరారయితే...?
మరో వైపు ఇంకో వాదన కూడా ఉంది. తాము పొత్తు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనివార్యమయితే యాభైకి పైగా శాసనసభ స్థానాలను, పన్నెండుకు పైగా పార్లమెంటు స్థానాలను డిమాండ్ చేయాలని కూడా ఫిట్టింగ్ పెడుతున్నారు. కానీ అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితిలో టీడీపీ ఉండదని వారికి తెలిసే ఈ రకమైన వాదనను ముందుంచుతున్నారు. తక్కువ స్థానాలను తీసుకుని నవ్వుల పాలయ్యే కంటే పొత్తు పెట్టుకున్నా బలం పెంచుకోవడానికి ఎక్కువ స్థానాలను కోరుకోవడంలో తప్పేంటన్న వితండవాదాన్ని తెరపైకి తెస్తున్నారు. అయితే ఫైనల్ గా టీడీపీతో పొత్తు ఉండాలా? లేదా? అన్నది నిర్ణయించేది కేంద్ర నాయకత్వమే కాబట్టి వీళ్ల చూపంతా ఢిల్లీ వైపే ఉంది. మరి పొత్తు విషయంలో ఏం జరుగుతుందన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికకరంగా మారింది.


Tags:    

Similar News