Hyderabad : రెండు కోట్ల జనాభాకు హైదరాబాద్ చేరుతుందా? లెక్కలు ఏం చెబుతున్నాయంటే?
హైదరాబాద్ నగరంలో భవిష్యత్ లో జనాభా రెండు కోట్ల జనాభాకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి
హైదరాబాద్ నగరంలో భవిష్యత్ లో జనాభా రెండు కోట్ల జనాభాకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి అత్యధిక శాతం మంది ఇక్కడకు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ జనాభా కోటికి పైగానే ఉంది. అది మరో పదేళ్లలో రెండు కోట్ల కు చేరే అవకాశముందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనంతో కిటకిటలాడుతున్న నగరం మరింతగా జనాభా చేరి దేశంలో అత్యధిక జనాభా కలిగిన జాబితాలో చేరే అవకాశాలున్నాయి. గత పదేళ్లతో పోలిస్తే హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరించింది. నగరానికి నాలుగు వైపులా నివాసభవనాలు ఏర్పడుతున్నాయి. వారికోసం జీహెచ్ఎంసీ అన్ని రకాల సౌకర్యాలను కూడా కల్పిస్తుంది.
కాస్ట్ ఆఫ్ లివింగ్...
ఇతర ప్రాంతాల కంటే హైదరాబాద్ సేఫ్ నగరంగా భావిస్తున్నారు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉండటంతో ఇక్కడకు వచ్చేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. బెంగళూరు, విశాఖ, చెన్పై నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందన్న నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉండే అన్ని రకాల వైద్య సౌకర్యాలు కూడా వలసలు అధికంగా రావడానికి కారణమవుతుంది. ఉపాధి కార్మికుల నుంచి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల వరకూ అందరినీ ఆదరించే నగరంగా పేరుపొందిన హైదరాబాద్ రెండు కోట్ల జనాభాకు చేరువవ్వడానికి ఎంతో కాలం పట్టదని అంటున్నారు.
అన్ని సౌకర్యాలు...
అందుకోసమే ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ లో భవిష్యత్ లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు మొదలు పెట్టారు. విద్యుత్తు, రహదారులు, వైద్యం, విద్య వంటి సౌకర్యాలు పుష్కలంగా ఉండటంతో హైదరాబాద్ అందరికీ ఆకర్షణగా మారింది. ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలు సయితం కోకొల్లలు. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఎంత ఆదాయానికి అంత ఖర్చన్నట్లు ఇక్క లివింగ్ ఉంటుంది. అందుకే హైదరాబాద్ నగరాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందుకే ఇక్కడ జీవిత చరమాంకంలో ఉండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
అంతర్జాతీయ రవాణాకు...
మరొక వైపు అంతర్జాతీయంగా రవాణా వ్యవస్థ హైదరాబాద్ లో అందుబాటులో ఉంది. అన్ని ప్రాంతాలకు రైలు మార్గాలున్నాయి. రోడ్డు మార్గం ఉంది. నేషనల్ హైవేలు నగరానికి నాలుగువైపులా ఉన్నాయి. ఇలాంటి నగరం దేశంలో మరెక్కడా ఉండదన్న భావన అందరిలోనూ నెలకొంది. అందుకే హైదరాబాద్ నగరంలో ఉండేందుకు అందరూ ఇష్టపడతారు. అన్ని రకాల మతాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ కలసి ఉండటంతో పాటు ప్రభుత్వాలు కూడా అవసరమైన మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటంతో హైదరాబాద్ నగరం నిజంగానే భాగ్య నగర్ గా పేరును సార్థకతను చేసుకుందని చెప్పవచ్చు. అంచనాల ప్రకారం 20235 నాటికి హైదరాబాద్ జనాభా రెండు కోట్లు దాటుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి.