ఆస్తుల కోసమా? ఓట్ల కోసమా? 43 వేల కుటుంబాతో చెలగాటమా?

నూతన రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్ళలో.. కార్పొరేషన్‌లను ప్రభుత్వంలో కలుపుకోవడం అంటే ఆశామాషీగా ఉందా

Update: 2023-08-03 15:54 GMT

నూతన రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్ళలో.. కార్పొరేషన్‌లను ప్రభుత్వంలో కలుపుకోవడం అంటే ఆశామాషీగా ఉందా? అది జరిగే పని అనుకుంటున్నారా? ఈ భూగోళం ఉన్నంత వరకూ ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కాదని నాడు బల్లగుద్ది చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తొమ్మిదేళ్ళ తర్వాత అదే సీఎం.. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 53 మంది కార్మికులను కోల్పోయి.. దాదాపు 47 రోజుల పాటు ఉధృతంగా జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. చివరికి దిక్కుతోచని సమయంలో కాంప్రమైజ్ అయిపోయింది. నాటి నుంచి నేటివరకూ ఆర్టీసీ ఉద్యోగులు స్వాభిమానం కోల్పోయి బ్రతుకీడుస్తున్న పరిస్థితులు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేరుస్తారని ఆశగా ఎదురుచూసి చివరికి ఆగమ్యగోచర పరిస్థితులు వచ్చేసరికి ప్రతీ ఆర్టీసీ కార్మికుడు గత్యంతరం లేక విధికి తలొంచేసారు.

తొమ్మిదేళ్ళ తర్వాత వాళ్ళ జీవితాలలో అనుకోని మలుపు చోటుచేసుకుంది. జూలై 31న రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో అఈఎస్ఆర్టీసిని ప్రభుత్వ రంగంలోకి విలీనం చేస్తున్నట్టు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది‌. అందుకుగానూ ఓ కమిటీని వేసి త్వరలో ప్రక్రియ మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు‌. క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌కి ప్లాన్ వేసిందని విమర్శలు వెల్లువెత్తాయి‌. 43 వేల మంది ఆర్టీసీ కార్మికలను గత్యంతరం లేమ తమ ఓట్ల లబ్దికోసం తిరిగి పావులుగా వాడుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ లేనిది, అసలు ఉద్యమం అంటే ఏంటో అని నీరుగారిపోయి ఉన్న కార్మికులకు తిరిగి ఆశలు రేపడం ఏంటని ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నాయి ప్రతిపక్షాలు‌. వంద రోజుల్లో ఎన్నికలు ఉండగా.. ఈ సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఆశ చూపి.. ఎన్నికల కోడ్ సమయానికి ప్రక్రియని నిలిపివేసి వాళ్ళ ఓట్ల కోసం కేసీఆర్ డ్రామాకు తెరతీశారని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
ఓవైపు 43 వేల కుటుంబాల ఓట్ల కోసం కేసీఆర్ టీఎస్ఆర్టీసిని పావులా వాడుకుంటున్నారు అని అనుకున్నా‌‌.. రాష్ట్రంలో టీఎస్ఆర్టీసి ఆస్తుల విలువ లక్ష కోట్ల వరకూ ఉండవచ్చనేది అంచనా. ఉద్యమం తొలినాళ్లలో వీటి విలువ పదివేల కోట్ల మేర ఉండేవని నాటి అంచనా. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు భారీగానే తూట్లు పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ అంచనాలను పటాపంచలు చేసి ప్రభుత్వ బడ్జెట్ పై గుదిబండగా మారింది‌. పాలన కొనసాగించడానికి ఏటా వేలకోట్ల అదనపు భారం అప్పుల రూపంలో ప్రజలపై పడుతోంది. దీనంతటికీ కారణం కేసీఆర్ తప్పుడు తడకల ప్రాజెక్ట్‌లూ స్కీమ్‌లే అని వివిధ వర్గాల వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎన్నికల ఖర్చుల కోసం ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునే కుట్ర చేస్తున్నారేమో అన్న అనుమానాలు రేగుతున్నాయి. గత తొమ్మిదేళ్ళలో ఆర్టీసీ ఎదురుకున్న ఇబ్బందులతో ఏటా ఆ రంగం వల్ల ప్రభుత్వానికి కలిగే నష్టాలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి‌. గత ఏడాది టీఎస్ఆర్టీసి 5879 కోట్ల వ్యాపారాన్ని చూసింది. రవాణా, పార్సల్ సర్వీసస్ రంగంలో ఆర్టీసీ గత మూడేళ్ళలో గుణాత్మక విప్లవాన్ని చూసింది. దాంతో టీఎస్ఆర్టీసీ వల్ల ప్రభుత్వం పై పడుతున్న భారం కూడా తగ్గుముఖం పట్టింది. బహుషా ఈ పరిణామంతోనే కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రేరేపించింది అనుకోవచ్చు‌. కానీ.‌‌. రాష్డ్రవ్యాప్తంగా ఉన్న విలువైన ఆస్తులను పరిగణిస్తే వాటిని ఆసరా చేసుకోవాలనే కాంక్షతో కేసీఆర్ క్యాబినెట్ విలీనం పై నిర్ణయం తీసుకుందని కూడా అనిపిస్తుంది. 15 వందల ఎకరాల మేర బస్ డిపోలు, బస్ స్టాపులు, స్టాఫ్ క్వాటర్స్‌లు, జోనల్ వర్క్‌షాపులు, బాడీ బిల్డింగ్ యూనిట్‌లు, స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజ్, హాస్పిటల్ ఇతరత్రా అసెట్లు టీఎస్ఆర్టీసి సొంతం. వాటి విలువ దాదాపు లక్ష కోట్ల పైమాటే!
టీఎస్ క్యాబినెట్‌లో ఆర్టీసీ విలీనం పై విదివిధానాల కమిటీని ఏర్పాటు చేయాలనే తొలుత నిర్ణయం తీసుకున్నారు. 43 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నప్పటికీ.. ప్రస్తుత రవాణా రంగ ఆస్తుల విషయంలో ప్రభుత్వం ఏ వైఖరిని ప్రదర్శిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా.. 43 వేల కార్మిక కుటుంబాల ఓట్ల కోసమే ఈ ఎత్తుగడ వేసారని కూడా అనిపిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కమిటీని వేసి కార్మికులలో ఆశ రేపి తర్వాత మొండి చేయి చూపుతారేమో అనడంలో కూడా సందేహం లేదు.


Tags:    

Similar News