వైఎస్ జగన్మోహన రెడ్డి వచ్చే ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు తప్పకుండా వస్తాయని చాలా నమ్మకంతో ఉన్నారు. ఆయన ఆ మాటను పార్టీ నాయకులతో కూడా పంచుకుంటున్నారు. ఆయనలో ఆ ఆశలు ఎలా రేకెత్తాయనే విషయమై తెలుగుపోస్ట్ గతంలోనూ కొన్ని కథనాలను అందించింది. అయితే తాజా పరిణామాలను గమనిస్తోంటే.. కేంద్రం నుంచి జగన్ కు అనధికారికంగా ఏమైనా సంకేతాలు అందుతున్నాయేమో అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. వచ్చే ఏడాది ఎన్నికలు తప్పకుండా వస్తాయనే జగన్ కలలకు భరోసా ఇచ్చేలా, ఆ కలలకు మరింత ఊపిరి పోసేలా.. ఇవాళ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు.
మనదేశంలో అవినీతిని నిర్మూలించడం అనేది ఒక్క నోట్ల రద్దుతో సాధ్యమయ్యే వ్యవహారం కాదని వెంకయ్యనాయుడు అంటున్నారు. దీనితో పాటు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని, ఎన్నికల సంస్కరణలు చేపట్టకుండా.. అవినీతి నిర్మూలన సాధ్యం కాదని.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగే వ్యవస్థ కూడా ఆచరణలోకి రావాలని వెంకయ్యనాయుడు అంటున్నారు. అసెంబ్లీకి, పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు జరిగే పద్ధతి రావాలని ఆయన అంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండొచ్చునంటూ జగన్ పెంచుకుంటున్న ఆశలకు కూడా అచ్చంగా ఆధారం ఇదే. కేంద్రం మదిలో ఇలాంటి ఆలోచన ఉన్నదనే సమాచారంతోనే జగన్.. అలా ఆశపడుతున్నారు.
అయితే విశ్లేషకుల అభిప్రాయం మరో రీతిగా ఉంది. 2019 వరకు పరిపాలన సాగించడానికి అవకాశం ఉన్న మోదీ సర్కారు.. తామంతగా పనిగట్టుకుని ఓ ఏడాది ముందుగానే.. తమ అధికారానికి తామే కత్తెర వేసుకుంటూ.. ప్రజల తీర్పు కోరడానికి సిద్ధపడుతుందా? అంత త్యాగానికి వారు సిద్ధమేనా? అనేది ఒక సందేహం. అదే సమయంలో.. మన దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన పరిణామంగా ఆవిర్భవించగల ఈ ఎన్నికల సంస్కరణలను తమ హయాంలోనే చేపట్టాం అనే కీర్తి కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కాలంలోనే ఆ నిర్ణయం కూడా తీసుకుంటారు... తద్వారా తమ ప్రభుత్వం సంస్కరణలకు, అవినీతి రహిత దేశ నిర్మాణానికి తయారుగా ఉన్నదనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు అనేది మరో అంచనా.