నల్లధనం : మోదీ కాలికి చుట్టుకున్న నల్లతాచు

Update: 2016-12-13 23:25 GMT

కాలికి చుట్టుకున్న పాము కాటేయక మానదు అంటారు పెద్దలు! కేంద్రంలోని మోదీ సర్కారు ఇప్పుడు అదే గండాన్ని ఎదుర్కొంటోంది. పాము కాటును తప్పించుకోవాలంటే... ఎలాంటి బూర ఊదాలా అనే అన్వేషణలో మోదీ సర్కారు బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. పైకి మాత్రం బింకం సడలకుండా.. ఈ కాలికి చుట్టుకున్నది నల్లత్రాచు కాదు.. గడ్డపోచ అంటూ బీరాలు పలుకుతోంది. కానీ... ‘నల్లధనం’ అన్నమాట, స్వదేశీ నల్లధనాన్ని ఏరిపారేస్తాం.. ఆ సొమ్ముతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేస్తాం అనే డాంబికపు ప్రకటనలు బూటకం అని తేలిపోయే పరిస్థితి దగ్గర్లోకే వస్తున్నట్లుంది.

స్వదేశీ నల్లధనం విషయంలో కేంద్రప్రభుత్వంలో కంగారు మొదలైంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం రద్దయిన పాతనోట్ల డినామినేషన్ లో దేశంలో ఉండవలసిన సొమ్ము 14.14 లక్షల కోట్ల రూపాయలు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా వెల్లడి అవుతున్న గణాంకాల ప్రకారం.. రెండు రోజుల కిందటి వరకు బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలోను, నగదు మార్పిడి రూపంలోను వచ్చి చేరిన పాతనోట్ల సుమారు 13 లక్షల కోట్లు. అంటే ఏమిటన్నమాట? ఇక దేశంలో చెలామణీలో ఉన్నది.. కేవలం 1.14 లక్షల విలువైన పాత నోట్లు మాత్రమే. ఎటూ ఈ డిసెంబరు 31 వరకు గడువు ఉన్నది గనుక.. ఈలోగా ఆ నోట్లు కూడా బ్యాంకులకు చేరిపోయినా కూడా ఆశ్చర్యం లేదు.

ఏతావతా.. దేశంలో ఆర్బీఐ లెక్కల ప్రకారం ఉండవలసిన 14.14 లక్షల విలువైన కోట్ల సొమ్ము మొత్తం బ్యాంకులకే చేరిపోతుంది. అనగా దాని అర్థం దేశంలో నల్లధనం ‘సున్నా’ అని తేలుతుంది. ఇప్పటిదాకా దేశంలో అక్కడక్కడా జరిగిన కొన్ని దాడుల్లో వెల్లడైన నగదు మొత్తాలు (శేఖర్ రెడ్డి లాంటి ఘటనల్లో) తప్ప నల్లధనం అనేది పెద్దగా వెల్లడైనట్లు కాదు.

అందుకే ఇప్పుడు మోదీ సర్కారులో కంగారు పుడుతోంది. బ్యాంకుల్లో డిపాజిట్టు అయినది మొత్తం తెల్లధనంగా భావించాల్సిన పనిలేదు.. అంటూ మోదీ సర్కార్ కొత్త పాట ఎత్తుకున్నది. ఈ పాటను, దానిద్వారా ప్రజల ఖాతాల్లో డిపాజిట్టు అయినది కూడా నల్లధనమే అనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను వెంకయ్యనాయుడు లాంటి అభినవ గోబెల్స్ భుజానికెత్తుకున్నారు.

ఎందుకంటే దేశంలో ‘ఉండవలసిన డబ్బు’ మొత్తం బ్యాంకులకు చేరిపోయిన తర్వాత.. అదనంగా ‘నల్లధనం’ అనే ట్యాగ్ లైన్ కింద బాహ్యప్రపంచంలో సొమ్ములేమీ లేవని తేలిన తర్వాత.. ఇక నోట్ల రద్దు అనే నిర్ణయం ద్వారా ఇన్ని రోజులుగా ప్రజలను యాతన పెట్టడం మొత్తం మూర్ఖచర్యగా తేలిపోతుంది. మోదీ ప్రభుత్వం అనాలోచితమైన తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నదనే ప్రతిపక్షాల వాదనకు బలం దక్కుతుంది. అందుకే బ్యాంకుల్లోకి వచ్చంది కూడా నల్లధనమే దాని లెక్క తేలుస్తాం.. అనే మేకపోతు గాంభీర్యపు మాటలతో కవరప్ చేయడానికి మోదీ సర్కారు సచివులు తెగబడుతున్నారు.

==

ఎందుకంటే... నల్లధనం అంటూ తాము ప్రజల మీద ప్రయోగించిన మాట నల్లత్రాచులా కాలికి చుట్టుకున్నదని వారు గ్రహించారు. దానిని విదిల్చి కొట్టడం సాధ్యం కాదని కూడా వారికి అర్థమైంది. అందుకే బూర ఊది దానిని శాంతింపజేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యమేనా?

గణాంకాల్లో చాలా స్పష్టంగా.. దేశంలో ఉండవలసిన సొమ్ము అంతా బ్యాంకులకు చేరిపోయిన తర్వాత... ‘నల్లధనం’ అంటూ ఇన్నాళ్లూ సర్కారు ఊదరగొట్టినది అసలేమిటి? ఎక్కడ ఉన్నది? అనే సందేహం సామాన్యుడికి కూడా కలుగుతుంది. కొత్తగా నోట్ల ముద్రణకు 25వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా, కనీసం ఆ మేరకు కూడా నల్లధనం వెలికి రాలేదనే విపక్షాల విమర్శలు సహేతుకంగా కనిపిస్తున్నాయి. మోదీ సర్కారు వీటన్నింటికీ ఏం సమాధానం చెబుతుంది?

లోతుగా గమనిస్తే.. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతున్న కొద్దీ.. మోదీ సర్కారులో ఉత్సాహం పలుచన అయిపోతున్నది. బ్యాంకుల్లో కుబేరులు తమ పనివాళ్లు, ఇతర సామాన్యుల పేరిట 2.5 లక్షల వంతున డిపాజిట్లు చేసుకున్నారని , జన్‌ధన్ ఖాతాల్లో పెద్దమొత్తాల్లో సొమ్ములేశారని వార్తలు వచ్చిన రోజున మోదీ చాలా ఉత్సాహపడ్డారు. ఆ సొమ్ములంతా మీరే తీసేసుకోండి... ఎవ్వరికీ తిరిగి ఇవ్వవద్దు అంటూ జోకులేశారు. తీరా.. దేశంలో అసలు నల్లధనమే లేదన్నట్లుగా నిగ్గుతేలే పరిస్థితి వస్తున్న ప్రస్తుత తరుణంలో... కంగారు పెరిగి.. పనివాళ్ల ఖాతాల్లో వేసినదంతా తెల్లధనం కాదు.. అవన్నీ కూడా లెక్కలు తీస్తాం.. అంటూ ప్లేటు ఫిరాయిస్తున్నారు. ప్రజాగ్రహానికి గురికాకుండా తమ వీపు కాచుకోవడానికి ఇలాంటి బుకాయింపు తప్ప మరో మార్గం లేదని వారు గుర్తించారు.

అయితే ప్రజలంతా కూడా నల్లధనం ఏదో ఉందంట... దాన్ని నాశనం చేస్తారంట అని నమ్మారు గనుకనే మోదీ సర్కారు నిర్ణయానికి మద్దతిచ్చి యాతనలన్నీ పడ్డారు. కానీ అంతా ఉత్తుత్తిదే అని తేలిపోయింది. ఇప్పుడు జనానికి తాము పడ్డ కష్టాలన్నీ గుర్తుకు వస్తే కడుపుమంట తారస్థాయికి చేరుతుందని అనుకోవచ్చు. అంటే.. ఇప్పటికే నల్లత్రాచు బుసలు కొడుతోంది. అసలే కాలికి చుట్టుకుని ఉంది.. అది గడ్డిపోచ అంటూ ఎంతకాలం భ్రమింపజేయగలరు? బూర ఊదుతూ ఎంతకాలం దానిని జో కొట్టగలరు? ఎప్పటికో ఒకనాటికి కాటు తప్పకపోవచ్చు.

అనాలోచితమైనదిగా నిగ్గు తేలుతున్న ఈ నిర్ణయానికి మోదీ సర్కారు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

Similar News