వెంకయ్య జాదూ : బంగారంపై జనాందోళన మాయం!

Update: 2016-12-15 03:59 GMT

ప్రజల వద్ద ఉన్న బంగారంపై ప్రభుత్వం లెక్క అడగబోతోంది.. దాని మీద పన్ను విధించబోతోంది.. అనే విషయంలో.. చాలా పెద్ద దుమారం రేగింది. మీడియా చానెళ్లు మొత్తం కోళ్లయి కూశాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధానంగా మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే క్రమంలో సాంతం హోరెత్తిపోయింది. ఈ మహిళల ఆగ్రహ జ్వాలల అగ్ని కీలల్లో మోదీ సర్కారు దహించుకుపోతుందేమో అన్నంత భయం, ఆందోళన కలిగాయి. అయితే రోజులు గడిచేసరికి ఒక్కసారిగా బంగారం గురించిన ఆందోళనలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. ఎక్కడా బంగారంపై పన్నును గురించిన ఊసు, దాని మీద ఉక్రోషం వినిపించడం లేదు.

అసలేం జరిగింది. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుందా? ఏదో యాక్సిడెంట్ జరిగితే రెండ్రోజులు అదే హడావుడి కనిపించినట్లుగా బంగారం గురించి టీవీ ఛానెళ్లు రెండ్రోజులు హోరెత్తించి మానేశాయా? ఇలా జరిగిందంటే.. ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించుకుని అయినా ఉండాలి. లేదా.. మహిళలకు ప్రీతికరమైన నిర్ణయం ఏదైనా వచ్చి ఉండాలి. కానీ అలాంటి వార్తలేమీ కనిపించలేదే..? ప్రభుత్వం తీరు మార్చుకున్నట్లు కనపడలేదే...? అనే సందేహాలు జనానికి కలగొచ్చు.

కానీ... బంగారం గురించిన ఆందోళనలు మొత్తం హఠాత్తుగా సమసిపోవడానికి ప్రధాన కారణం జాదూగర్ వెంకయ్యనాయుడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. వెంకయ్యనాయుడు అనే ఇంద్రజాలికుడు... తన చేతిలోని మంత్రదండాన్ని... చాలా సమర్థంగా ప్రయోగించి.. జనంలోని ఆందోళన మీడియాలో ఎక్కడా కనిపించకుండా, వినిపించకుండా తొక్కేశారనే .. అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వెంకయ్య పుణ్యమాని.. బంగారంపై పన్ను రచ్చలోంచి .... ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకునే వెసులుబాటు దక్కిందని అంతా అనుకుంటున్నారు.

వెంకయ్యనాయుడు సమాచార ప్రసారశాఖకు కేంద్రమంత్రిగా ఉన్నారు. టీవీ ఛానెళ్లకు సంబంధించిన సమస్త అనుమతులు మాత్రమే కాదు.. వారికి ప్రకటనలు మొత్తం విడుదల చేసేది ఆయన శాఖ ఆధ్వర్యంలోనే. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు అంటే.. ఛానెళ్లకు పత్రికలకు బంగారు గుడ్డు పెట్టే బాతుతో సమానం. మరి అలాంటి బాతును కోసుకునే ఉద్దేశంతో ఈ రోజుల్లో ఎవరుంటారు? అందుకే వెంకయ్యనాయుడు పైరవీలకు మీడియా సంస్థలు అన్నీ తలొగ్గాయని.. బంగారంపై పన్ను గురించి జనం కూడా మరచిపోయే విధంగా.. ఉన్నపళంగా ఆ గొడవలకు సంబంధించిన కవరేజీలు మొత్తానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారని అంతా అనుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత పెద్ద రభస జరిగిందో అందరూ చూడనే చూశారు. కొన్ని రోజుల పాటూ ఛానెళ్లంతా వేరే ప్రపంచమే లేనట్లుగా... నగరాలనుంచి పల్లెల వరకూ ఇంటింటికీ వెళ్లి.. మహిళలతో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు చర్చావేదికలు నిర్వహించారు. ఆడవాళ్ల పుస్తెల తాడును మోదీ లాక్కుపోతున్నాడంటూ పెద్దపెట్టున విమర్శలకు కారణం అయ్యారు. జనం దుమ్మెత్తిపోయడానికి పరోక్షవేదికగా నిలిచారు. అయితే ఇవన్నీ హఠాత్తుగా అంతర్ధానం అయిపోయాయి.

నిపుణులు అంచనా వేసిన ప్రకారం.. నోటు కష్టాలు కలిగించిన వ్యతిరేకత కంటె.. బంగారం గురించిన పన్ను వివాదం మరింత ఘోరంగా ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. అయితే ఆ ఆగ్రహం సంగతి దేశవ్యాప్తంగా వ్యాపించకుండా వెంకయ్య జాదూ పనిచేసింది. ఈ రకంగా మోదీ సర్కారు మనుగడలో వెంకయ్య పోషిస్తున్న పాత్ర చిన్నదేమీ కాదని పలువురు అంచనా వేస్తున్నారు.

Similar News