సంతోషించాలా? బాధపడాలా?
తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం కనిపిస్తున్నా.. నేతల్లో మాత్రం టెన్షన్ పట్టుకుంది.;
తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం కనిపిస్తున్నా.. నేతల్లో మాత్రం టెన్షన్ పట్టుకుంది. తమ సీటు ఎక్కడ పొత్తులో భాగంగా పోతుందో? నన్న ఆందోళన చాలా మందిలో బయలుదేరింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లా నేతల్లోనే ఈ భయం ఎక్కువగా కనిపిస్తుంది. జనసేనలో పెద్దగా యాక్టివ్ నేతలు లేకపోయినా పొత్తు తర్వాత ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరతారని నేతలు భయపడిపోతున్నారు. అలాగని జనసేన పొత్తును కాదనలేని పరిస్థితి. అదే సమయంలో తమ సీటు మిత్రపక్షానికి వెళితే మరో ఐదేళ్లు పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సైకిల్ పార్టీలో హాట్ టాపిక్.
సీమలో బలం లేదని...
అందులోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు రాయలసీమలో బలం లేదని బహిరంగంగానే చెప్పేశారు. అంటే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో మాత్రమే ఆయన తన పార్టీకి సంబంధించిన సీట్లను పొత్తులో భాగంగా కోరే అవకాశముంది. నలభై స్థానాలను పవన్ కోరితే కనీసం ముప్ఫయి స్థానాలయినా టీడీపీ ఇవ్వక తప్పదు. సీట్ల విషయంలో రాజీ పడితే క్యాడర్ నుంచి నేతల నుంచి పవన్ వ్యతిరేకత ఎదుర్కొనాల్సి ఉంటుంది. పొత్తు నిర్ణయం ప్రకటించినంత ఈజీ కాదు. సీట్ల పంపకంలో తేడా వస్తే నచ్చ చెప్పడం. అందులోనూ పవన్ తాను రాజీ పడబోనని, న్యాయ జరిగేలా తన వ్యూహం ఉంటుందని పలుమార్లు చెప్పడంతో టీడీపీ నేతలు తమ సీటు విషయంలో వణికి పోతున్నారు.
పంచకర్ల రమేష్...
ఉదాహరణకు సీనియర్ నేత పంచక్ల రమేష్ ఇటీవల వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయన గతంలో యలమంచిలి, పెందుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్ తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైసీపీ ఇలా అన్ని పార్టీలూ మారి ఇప్పుుడు జనసేనలోకి ఎంటర్ అయిపోయారు. జనసేన కండువా కప్పుకున్నది ఆయన ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే. ఆయన చేరేటప్పుడే సీటు ఒప్పందం చేసుకుని మరీ వచ్చారంటారు. పంచకర్ల రమేష్ బాబు రెండు నియోజకవర్గాల్లో ఏదైనా తనకు ఓకే అని చెబుతున్నారట. ఒకటి పెందుర్తి కాగా, మరొకటి యలమంచిలి నియోజకవర్గం. పెందుర్తిలో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి టీడీపీలో ఉన్నారు. ఆయనను కాదని ఆ సీటును టీడీపీ జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండదు. అదే సమయంలో యలమంచిలి సీటు ఆశిస్తున్న టీడీపీ నేతలకు మాత్రం ఇప్పుుడు బెంగ పట్టుకుంది.
అనేక చోట్ల...
అయితే ఏమీ చేయలేని పరిస్థితి. జిల్లాలో కొన్ని సీట్లు జనసేనకు పొత్తులో భాగంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది పొత్తు ధర్మం. దానిని కాదని ఎన్నికలకు వెళ్లడం కూడా ధర్మం కాదు. అలాగని తమ రాజకీయ జీవితానికి ఐదేళ్ల పాటు కామా పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని చోట్ల ముందుగానే జనసేనలోకి వెళ్లి తమకు టిక్కెట్ తెచ్చుకుంటే పోలా? అని ఆలోచిస్తున్నారట. పవన్ కు సన్నిహితులైన వారితో కొందరు టచ్ లోకి వెళుతున్నట్లు సమాచారం. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక పొత్తులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని, అప్పటి వరకూ వెయిట్ చేసి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుందామని మరికొందరు నేతలు యోచిస్తున్నారు. మొత్తం మీద పొత్తులు కుదిరాయని సంతోషించాలో? లేక తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న బాధపడాలో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు.