ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు త్వరలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 70 శాసనసభ నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీకి గెలుపు ఎంత వరకూ దక్కుతుందన్న దానిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మెజారిటీ స్థానాలను కమలం పార్టీ గెలుచుకోవడం ఖాయమన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోస్థానానికి పడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.
హ్యాట్రిక్ విజయాలను...
జమిలి ఎన్నికలకు ముందు జరుగుతున్న ఢిల్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రచార కార్యక్రమానికి తెరలేపారు. ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోయినప్పటికీ ప్రచారాన్ని అధికారికంగా మోదీ ప్రారంభించినట్లే అనుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో మూడు సార్లు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వస్తుంది. 2013 వరకూఢిల్లీ పీఠం పై కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత తాను విజయాన్ని దక్కించుకుంది. 2013, 2015, 2020 ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. 29 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఒడిశా తరహాలోనే...
ఇక నాలుగో సారి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాలేదని అంటున్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని పెద్దయెత్తున బెట్టింగ్ లు నోటిఫికేషన్ కు ముందు నుంచే సాగుతున్నాయి. ఒడిశాలోనూ తొలుత బలపడేందుకు ప్రయత్నించి... నిలదొక్కుకున్న బీజేపీ తర్వాత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈసారి అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి మరకలు పడటంతో పాటు ఆయన జైలుకు వెళ్లి రావడం కూడా కమలం పార్టీకి లాభిస్తుందని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లబ్ది పొందుతుందని కూడా లెక్కలు వినపడుతున్నాయి. వేచిచూసి అధికారంలోకి రావడం బీజేపీ లెక్క.
ఐదు సార్లు గెలిచిన...
ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందంటున్నారు. అందుకే ఈసారి బీజేపీకి ఢిల్లీ పీఠం దక్కడం ఖాయమన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. ఐదు సార్లు గెలిచిన నవీన్ పట్నాయక్ ను ఒడిశాలో మట్టి కరిపించగా లేనిది కేజ్రీవాల్ పెద్ద లెక్క కాదని కమలం పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. దాదాపు పన్నెండేళ్ల నుంచి అధికారంలో ఉన్న పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత తమకు లాభిస్తుందన్న లెక్కలు కమలం పార్టీ నేతలు వేసుకుంటున్నారు. అందుకే హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా తరహాలోనే ఈసారి బీజేపీ ఢిల్లీలో గెలవడం ఖాయమని ఎక్కువ మంది బెట్టింగ్ లు కడుతుండటం విశేషం.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now