Andhra Pradesh : ఆ ఆశలు వద్దు బాబాయ్.. కనుచూపు మేరలో లేవుగా

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వచ్చే ఎన్నికల్లోనూ కలసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు;

Update: 2025-01-03 08:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు ముందు అనేక ఊహాగానాలు వినిపించాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలవబోరని దాదాపు చాలా మంది అంచనా వేశారు. బీజేపీ ఏదో ఒకటి చేసి కూటమి ఏర్పాటు కాకుండా చూసుకుంటుందన్నభరోసాలో దిలాసాగా వైసీపీ నేతలు కూడా ఉన్నారు.చివరకు పట్టుబట్టి సాధించి మరీ కూటమిని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ఏర్పాటు తర్వాత కూడా దీనిపై అనేక రకాలుగా ప్రచారం సాగింది. అభ్యర్థుల ఎంపికలోనూ, సీట్ల కేటాయింపుల్లోనూ విభేదాలు తలెత్తుతాయని భావించారు.కానీ ఎన్నికలకు చాలా కంఫర్ట్ గా మూడు పార్టీలు కలిసి వెళ్లడంతో ఆశలు పెట్టుకున్నవాళ్లంతా అవాక్కయ్యారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరకమైన ప్రచారం ఆగలేదు.

ప్రచారం ఎలా ఉన్నా...
మంత్రి వర్గం ఏర్పాటు దగ్గర నుంచి మొదలయిన ఈ ప్రచారం ఇంకా సాగుతూనే ఉంది. అసంతృప్తులు బయలుదేరుతాయని ఎవరికి వారు ప్రత్యర్థులు అంచనా వేసుకున్నారు. కానీ అంతా సాదాసాదీగా, సాఫీగా జరిగిపోయింది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలోనూ అనేక వదంతులు షికార్లు చేశాయి. నామినేటెడ్ పోస్టుల కోసం ఇటు జనసేన, అటు బీజేపీ పట్టుబడుతుందన్న ఊహాగానాలు చెలరేగగా అవి ఊహలకే పవన్, చంద్రబాబులు పరిమితం చేశారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసినప్పటికీ ఎలాంటి అసంతృప్తులు రాలేదు. ఒకవేళ పార్టీ నేతల్లో ఉన్న ఇంకా అనేక పదవులు వచ్చేవి ఉండటంతో మౌనంగా ఉన్నారన్నా అనుకోవాలి. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.

Full View

పొరపొచ్చాలు రాకుండా...
పార్టీలో నేతలను పక్కన పెడితే.. అగ్రనేతలు అందరూ కలసి కట్టుగానే ఈ ఏడు నెలల నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. ఎక్కడా కొద్దిగా కూడా పొరపొచ్చాలు రాలేదు. అనేక నిర్ణయాలు తీసుకున్నా ఇటు పవన్ కల్యాణ్ నుంచి కూడా పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు వెలువడలేదు. ఒకహోంశాఖపైనే ఆయన నేరుగా కామెంట్ చేయడం కొంత కలకలం రేపింది. ఎందుకంటే హోంశాఖను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షిస్తుండటంతో తేడా కొట్టిందన్న కామెంట్స్ వినపడ్డాయి. కానీ చంద్రబాబు వెంటనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి తామిద్దరమూ ఒక్కటేనన్న సంకేతాలను ఇటు పార్టీ నేతలకు, అటు ప్రత్యర్థులకు బలంగా పంపగలిగారు. ఇద్దరూ ఇప్పటి వరకూ ఏ అంశంపైనా విభేదించుకున్న దాఖలాలు లేవు.
ఇద్దరూ ఒకరికొకరు...
ఇకముందు కూడా ఉండవన్న ధీమా ఆ పార్టీల క్యాడర్ లో కనపడుతుంది. ఎందుకంటే పవన్ అడిగింది చంద్రబాబు కాదనడం లేదు.. అలాగే చంద్రబాబు చెప్పినదానికి పవన్ కల్యాణ్ ఓకే అని చెబుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. పట్టు విడుపులతో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. రాజకీయంగా జగన్ ను ఎదుర్కొనాలంటే కలసి ప్రయాణంచేయడం ఒక్కటేనన్న అభిప్రాయానికి ఇద్దరు నేతలు వచ్చారు. అందుకే ఎవరేమి అన్నా, ఏ విషయంలోనైనా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. పైగా పవన్ కల్యాణ్ ఏకంగా పదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని ఆకాంక్షించారంటే ఆయన ఏ రేంజ్ లో చంద్రబాబు అంటే గౌరవమో చెప్పకనే తెలుస్తోంది. సో.. ఇద్దరూ విడిపోతారన్న ఆశలు ఎవరు పెట్టుకున్నా అవి అడియాసలు కాక తప్పవు బ్రదరూ.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News