Kodali Nani : కొడాలి నాని గాయబ్..కారణాలేంటి?

కాలర్ ఎగరేసుకుంటూ తిరిగే కొడాలి నాని ఇప్పుడు కనిపించడం లేదు.;

Update: 2025-01-03 07:05 GMT

కాలర్ ఎగరేసుకుంటూ తిరిగే కొడాలి నాని ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా వెళ్లారు. ఎంతగా అంటే ఆయన కనిపించి కొన్ని నెలలు అవుతుంది. ఓటమి పాలయిన తర్వాత కొత్తలో కనిపించి కొంత హడావిడి చేసినట్లు కనిపించినా తర్వాత మాత్రం ఆయన మళ్లీ గాయబ్ అయ్యారు. ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారంటున్నారు. ఆయన సన్నిహితులు, అనుచరులు ఎవరైనా కలవాలని భావించినా హైదరాబాద్ కు రావాలని సూచిస్తున్నారట.ఆయన గుడివాడకు వచ్చికూడా చాలా రోజులయింది. ఇక సంక్రాంతి పండగకు కొడాలి నాని వస్తారా? రారా? అన్న చర్చ కూడా గుడివాడ ప్రాంతంలో జోరుగా సాగుతుంది. ఇక తాజాగా కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది.

తిరుగులేదనుకుంటే....
గుడివాడలో గెలుపునకు తనకు తిరుగులేదనుకున్న కొడాలి నానికి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురయింది. పార్టీలు మారినా గుడివాడ ప్రజలు కొడాలి నానిని అదరించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి ఆ ఓటమిని తాను కూడా ఊహించలేదు. గుడివాడ ప్రజలు తనను వదులుకోరని కొడాలని నాని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కానీ ప్రజలు మార్పు కోరుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో మొన్నటి ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. దీనికి ప్రధాన కారణం అభివృద్ధి పనులను పక్కన పెడితే ఆయన వాడిన భాష రాష్ట్ర స్థాయిలో జనంలో పెద్ద చర్చగా మారింది. రచ్చగా మారి అది ఓటర్లపై ప్రభావం చూపిందంటున్నారు.

నాలుగు సార్లు గెలిచి...
2004 కొడాలి నాని టీడీపీ నుంచి తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీలోకి వెళ్లారు.ఆ ఎన్నికలలో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం వెనిగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలతో జనంలోకి చొచ్చుకుని మరింతగా వెళ్లవచ్చునని అనుకన్నారు కానీ అది రివర్స్ అయింది. ఆయన మాటలు, బూతులు విన్న వారంతా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అందుకే కౌంటింగ్ జరుగుతున్నసమయంలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
కేసుల భయం...
ఇక అప్పటి నుంచి కొడాలి నాని పెద్దగా యాక్టివ్ గా లేరు. ఎందుకంటే ఆయనకు కేసుల భయం పట్టుకుంది. తనను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తారని తెలుసు. ఇప్పటికే కొడాలి నాని అనుచరులు అనేక కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఇదేజిల్లాలో మరో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూడా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కొడాలినాని కూడా కొంత కేసుల భయం పట్టుకుందని చెబుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి కొడాలి నాని విషయంలో వెనక్కు వెళ్లవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వత్తిడులు కూడా ఎక్కువయ్యాయంటున్నారు. అదే సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ లోనూ కొడాలి నాని పేరు మొదటి పేజీలో ఉందన్న కామెంట్స్ ఆయనకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News