ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. ఆయన ఏపీలో కూటమి ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం. ఒకరకంగా బీజేపీ, టీడీపీని ఒక వేదికపైకి చేర్చడానికి పవన్ కల్యాణ్ ముఖ్య కారణం. పవన్ కల్యాణ్ వల్లనే ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించింది. మరోవైపు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో సత్సంబంధాలతో పాటు సాన్నిహిత్యం కూడా ఉంది. అలాగే పవన్ కల్యాణ్ అన్నా కూడా ఢిల్లీ పెద్దలకు ప్రేమ, గౌరవం కూడా. పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలో కేంద్ర నాయకత్వం కూడా ఆలోచిస్తుంది. అదే సమయంలో దక్షిణ భారత దేశంలో క్రౌడ్ పుల్లర్ గా కూడా పవన్ కల్యాణ్ ను సెంట్రల్ పార్టీ గుర్తిస్తుంది.
రేవంత్ ను వెనకేసుకు రావడం...
అయితే పవన్ కల్యాణ్ మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రిని వెనకేసుకు రావడం, పొగడ్తలతో ముంచెత్తడం, ప్రశంసలను కురిపించడం ఇప్పుడు ఏపీలోనే కాదు ముఖ్యంగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై పవన్ కల్యాణ్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అయితే ఈ సమావేశలో రేవంత్ రెడ్డి తప్పేమీ లేదన్నట్లు ఆయన అన్నారు. రేవంత్ స్థానంలో ఎవరున్నా అదే చేసేవారని, రేవంత్ సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కూడా కొనియాడరు. ఈ ఘటనలో పుష్ప టీం తప్పేనంటూ పవన్ కల్యాణ్ తెగేసి చెప్పారు. అంతేకాదు ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెనకేసుకు వచ్చారు. అయితే దీనిపై బీజేపీ నేతలు మాత్రం ఒకింత అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది.
బీజేపీ నేతలు మాత్రం...
పుష్ప ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై ఇటు ఏపీ బీజేపీలోని నేతలు, అటు తెలంగాణ బీజేపీ యావత్తూ అల్లు అర్జున్ వైపు నిలబడింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక స్టేట్ మెంట్లు ఇచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు అల్లు అర్జున్ ను వెనకేసుకు వచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి సయితం కూడా అల్లు అర్జున్ తప్పేమీ లేదని ప్రకటన చేశారు. కానీ ఇందుకు విరుద్ధంగా కూటమిలో ఉన్న పవన్ కల్యాణ్ మాత్రం తప్పు అల్లు అర్జున్ టీందేనని తేల్చి చెప్పడంతో రేవంత్ కు మరింతగా క్రేజ్ పెరిగిందంటున్నారు. ఇప్పటి వరకూ మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ లో ఒకింత వ్యతిరేకత ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్ తో కొంత మైలేజీ పెరిగిందన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతుంది.
సున్నితమైన అంశంపై...
మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఒక సున్నితమైన అంశంపై మౌనంగానైనా ఉండాలి. లేదంటే మిత్రపక్షంలోని పార్టీలకు అనుగుణంగా వ్యవహరించాలి. అంతే తప్ప అందుకు విరుద్ధంగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం ఏంటన్న ప్రశ్నలు ఇప్పుడు కమలనాధుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ కల్యాణ్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రకం కావడంతో ఆయన తన మనసులో ఉన్నది ఆఫ్ ది రికార్డులో చెప్పారని, అంటే చిట్ చాట్ లోనే ఆయన ఈ రకంగా స్పందించారని, బహిరంగ వేదికలపై ఎక్కడా ఈ విషయంపై రెస్పాన్స్ కాలేదన్న విషయాన్ని కూడా జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద మిత్ర పక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడంపై ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేతలు గుర్రుగానే ఉన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now