వీరికి బీజేపీపై ఎందుకింత వ్యామోహం!

ఏపీ రాష్ట్ర రాజకీయాలు విచిత్రంగా, హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. ఒక పార్టీపై మరొక పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

Update: 2023-07-09 12:27 GMT

ఏపీ రాష్ట్ర రాజకీయాలు విచిత్రంగా, హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. ఒక పార్టీపై మరొక పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఆయా పార్టీల వ్యవహారశైలి చూస్తుంటే.. చివరకు ఎవరు తీసిన గోతిలో వారే పడేటట్టుగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన ప్రధాన ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. వీటికి ఓటు బ్యాంక్‌ కూడా ఎక్కువే. అయితే ఎలాంటి ఓటు బ్యాంకు లేని బీజేపీ మాత్రం.. ఈ మూడు పార్టీలను తన చేతిలో పెట్టుకుని తోలు బొమ్మలాట ఆడిస్తోంది. ఇక ఈ పార్టీలు కూడా బీజేపీ చెప్పినట్టు వింటాయి. అయితే ఈ మూడు పార్టీలకు బీజేపీ అంటే ఎందకంతా వ్యామోహం అనేది వంద డాలర్ల ప్రశ్న. బీజేపీ చెప్పినట్టు వైసీపీ, టీడీపీ, జనసేన ఎందుకు వింటున్నాయి. అసలు ఇక్కడ ఎవరు ఎవర్ని రాజకీయంగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు.

ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే.. వైసీపీ మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతులు నలుపుతోంది. అటు 2014 నుండి 2019 ఎన్నికల ముందు వరకూ బీజేపీతో అంటకాగిన టీడీపీ.. చివరికి ఏమొచ్చిందో తెలియదు..’ధర్మపోరాటం’ పేరుతో బయటకొచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. ఆ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి ప్రత్యక్షంగా టీఆర్ఎస్, పరోక్షంగా బీజేపీ వైసీపీకి మద్దతిచ్చాయి. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకూ కేంద్రంలోని బీజేపీతో స్నేహాంగా మెలుగుతూ వస్తోంది. ఈ మధ్య బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా.. ఏపీలో వచ్చి జగన్ నాయకత్వంలోని వైసీపీని అనరాని మాటలు అంటే.. దానికి కౌంటర్‌గా సీఎం జగన్ పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్‌.. బీజేపీతో చేతులు కలపడానికి తన సంసిద్ధతను స్వచ్ఛందంగా తెలిపారని జాతీయ మీడియాతో పాటు వ్యతిరేకులు చెబుతున్నారు.

ఒక వేళ ఇదే జరిగితే జగన్ కు మాత్రం కోలుకోలేనంత నష్టం మాత్రం ఖచ్చితంగా వాటిల్లుతుంది. ఆ సమయంలో టీడీపీ, జనసేనలు బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ జగన్‌కు తెలియవా?.. చంద్రబాబును ఓడించేందుకు రాజకీయంగా పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరోవైపు జనసేన కేంద్రంలో బీజేపీతో చేతులు కలిపి, ఎన్డీఏలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు కోసం బీజేపీ.. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ అండ కోసం జనసేన.. రెండు అంటకాగుతున్నాయి. ఇటు కేంద్రంలో బీజేపీకి చాలా దగ్గరవ్వడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా యత్నిస్తున్నారు. దీంతో మూడు పార్టీలు.. ఎవరికి వారుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్డీఏ మద్దతు చంద్రబాబుకు ఉండకుండా జగన్ వ్యూహం రచిస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. జనసేన కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. చివరకు ఏ పార్టీ గెలిచినా.. బీజేపీ చేతిలో తొలు బొమ్మలా కావాల్సిందేనన్నది అక్షర సత్యం.

Tags:    

Similar News