షర్మిలమ్మ నిర్ణయం.. కాంగ్రెస్ కు లాభమా? నష‌్టమా?

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇచ్చిన గడువు ముగిసింది.

Update: 2023-09-30 12:32 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ నెల 30వ తేదీలోగా పార్టీ విలీనంపై నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని చెప్పారు. 119 నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో ఉంటారని కూడా షర్మిల తెలిపారు. అందుకు కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అందరికీ న్యాయం జరుగుతుందని, ఎవరూ నిరాశ పడనవసరం లేదని కూడా నేతలకు షర్మిల సూచించారు.

నేటితో ముగిసిన...
అయితే షర్మిల విధించిన డెడ్ లైన్ నేటితో ముగిసింది. కాంగ్రెస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది. దీంతో షర్మిల ఇక తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ గా రాజకీయాలు చేస్తూ వచ్చిన షర్మిల ఇక కాంగ్రెస్ పై కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల ఇప్పటికే పార్టీ క్యాడర్ కు సమాచారం పంపినట్లు తెలిసింది. త్వరలోనే పూర్తి స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటిస్తానని ఆమె వెల్లడించినట్లు సమాచారం.
పాదయాత్ర చేసి...
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి అధికారం దిశగా ప్రయత్నించారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. ఆమె పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడినా వెరవకుండా పాదయాత్ర చాలా వరకూ పూర్తి చేయగలిగారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. పాలేరులో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే మధ్యలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలసి వచ్చారు. త్వరలో విలీనం చేయడానికి రెడీ అయిపోయారు.
అభ్యంతరాలు...
అయితే రాష్ట్ర కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది. తెలంగాణలో కాకుండా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. అయితే అందుకు షర్మిల విముఖత చూపడంతో కాంగ్రెస్ పార్టీ విలీనం ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. దీంతో షర్మిల తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ షర్మిల ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కు నష్టమా? లాభమా? షర్మిల వల్ల కాంగ్రెస్ ఎంత మేరకు నష్టపోతుంది? లేకపోతే లాభపడుతుందా? అన్నద మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాతనే తెలియనుంది.


Tags:    

Similar News