Pawan kalyan : ఇద్దరినీ కలిపావు సరే.. నీకొచ్చిన బెనిఫిట్ చెప్పవయ్యా సామీ?
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి లైన్ క్లియర్ అయింది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి లైన్ క్లియర్ అయింది. అయితే ఈరెండు పార్టీలను కలపడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కృషిని ఎవరూ కాదనలేరు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎన్డీఏలో చేరిన పవన్ కల్యాణ్ తర్వాత వైసీపీకి వ్యతిరేకంగా తన గళం విప్పుతున్నారు. విడివిడిగా పోటీ చేస్తే జగన్ ను ఓడించడం కష్టమని భావించిన పవన్ కల్యాణ‌్ తాను ఓట్లను చీలనివ్వబోనని చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి జగన్ ను దించేస్తామంటూ ఆయన రెండేళ్ల క్రితమే సవాల్ విసిరారు.
మొన్నటి వరకూ దూరంగానే....
బీజేపీ కేంద్ర నాయకత్వంతో టచ్ లో ఉన్న పవన్ కల్యాణ్ రాష్ట్ర పార్టీ నేతలను మాత్రం పట్టించుకోలేదు. వారితో కలిసి నడవలేదు. ఒక్క తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో మాత్రమే ఒక్కరోజు ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసినా అక్కడ ప్రచారానికి ఆయన వెళ్లలేదు. దీంతో పవన్ బీజేపీకి దూరమవుతున్నారా? అన్న అనుమానం అప్పట్లో కలిగింది. కానీ విశాఖలో ప్రధానితో భేటీ తర్వాత ఆయన స్వరంలో మార్పు వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో కలసి పోటీ చేశారు. బీజేపీతో కలిసి నడుస్తామని పదే పదే చెబుతూ ఆ పార్టీని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కూడా వెళ్లి వచ్చారు.
ఓట్లు చీలనివ్వనంటూ...
కానీ వైసీపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లి బయటకు వచ్చి టీడీపీ, జనసేన పొత్తును అధికారికంగా ప్రకటించారు. తాము వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ ప్రకటించారు. బీజేపీతో సంప్రదించకుండా ఎలా ప్రకటిస్తారని అప్పట్లో అనుమానం కలిగినా తాను ఢిల్లీ పెద్దలను ఒప్పించగలనన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయనకు మోదీ, అమిత్ షాలతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలోనే పవన్ ముందుగా టీడీపీతో పొత్తు ఉన్నట్లు ప్రకటన చేసినట్లు ఇప్పుడు భావించాల్సి ఉంటుంది. కేవలం జగన్ ను అధికారం నుంచి దించడం కోసమే వీరిద్దరినీ కలిపారా?
ప్రయోజనం ఏంటి?
అంతా బాగానే ఉంది. వారద్దరూ కలిశారు. సరే. పవన్ కు ఏ రకంగా ప్రయోజనం? బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా చేద్దామన్న డైరెక్షన్ ఉందా? అన్న అనుమానాలు కూడా టీడీపీ నేతల్లో కలుగుతున్నాయి. లేకుంటే బీజేపీ నేతలు పాత వైరుధ్యాలు మరిచిపోయి తమంతట తాముగా పిిలిచి ఎన్డీఏలో చేరాలని చంద్రబాబును కోరడం వెనక కమలం వ్యూహం ఏమై ఉంటుందా? అన్న చర్చ మాత్రం సైకిల్ పార్టీలో జోరుగా సాగుతుంది. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత చంద్రబాబును తమ గ్రిప్ లోకి తెచ్చుకునేందుకు పవన్ ను ఇలా కమలం పార్టీ వాడుకుందా? అన్న సందేహమూ కలుగుతుంది. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అన్నది మాత్రం జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది.