BRS : కారు రేస్.. కాళేశ్వరం క్యాష్... నేతల మెడకు చుట్టుకుంటున్నాయా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది

Update: 2024-12-20 06:01 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ , బీఎన్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారం గత కొద్ది రోజులుగా నడుస్తుంది. తెలంగాణలో పెద్దయెత్తున దీనిపై చర్చజరుగుతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో యాభై నాలుగు కోట్ల రూపాయల నిధులను మంత్రివర్గం ఆమోదం లేకుండా విడుదల చేశారన్న ఆరోపణలపై కేసు నమోదయింది. నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు కావడంతో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.




 


ప్రజల ముందుకు వెళ్లడానికి...
అయితే రాజకీయంగా కేటీఆర్ కు ఇది ఎంత వరకూ లాభం? అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం? అన్న దానిపై కూడా చర్చ ప్రారంభమయింది. రాజకీయ కక్షపూరిత కేసు అని విపక్ష బీఆర్ఎస్ ప్రజల ముందుకు వెళుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. తమపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూడా ప్రజల్లోకి కారు పార్టీ వెళ్లే అవకాశాలున్నాయి. మరి జనం నమ్ముతారా? లేదా? లేకపోతే కేటీఆర్ కు సానుభూతి వస్తుందా? అది పార్టీకి రానున్న కాలంలో రాజకీయంగా లాభం చేకూరుస్తుందా? అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. జమిలి ఎన్నికలు జరిగినా 2027 లేదా 2029 లోనే ఎన్నికలు జరిగే అవకాశముంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో...
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ కూడా విచారణ జరుగుతుంది. అత్యంత వేగంగా కమిషన్ విచారణ చేపడుతుంది. ఈ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి నివేదికలు అందిన వెంటనే సంబంధిత అధికారులు, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే అవకాశముంది. యాక్షన్ కు దిగేందుకు ఛాన్స్ ఉంటుంది. దీంతో ఇటు కేటీఆర్ కార్ రేసు కేసు, అటు కేసీఆర్ కు కాళేశ్వరం కేసు మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. అయితే ఇది రాజకీయంగా లాభమా? నష్టమా? అన్నది పక్కన పెడితే అవినీతి జరిగిందని చెప్పడమే ప్రభుత్వఉద్దేశ్యంగా కనపడుతుంది. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ రకమైన కేసులు బయటకు వస్తున్నాయని చెప్పకతప్పదు.
ఎన్నికలకు ఇంకా ...
అదే సమయంలో ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి, ఇటు కాళేశ్వరం, అటు కారు రేసులో జరుగుతున్న విచారణ రాజకీయంగా ఎలాంటి నష్టం తెచ్చిపెట్టదని అధికార పార్టీ అభిప్రాయపడుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టయి కొన్ని నెలలు పాటు జైలులో ఉన్నా తెలంగాణలో ఏమాత్రం సానుభూతి పనిచేయలేదని, ప్రజలు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు ఇవ్వలేదన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుకు తెస్తున్నారు. దీంతో త్వరత్వరగా కేసులు విచారణ పూర్తి చేసి బీఆర్ఎస్ అగ్రనేతలను ఇబ్బందిపెట్టాలన్న ఆలోచనలో మాత్రం ప్రభుత్వం ఉన్నట్లే కనిపిస్తుంది. అదే సమయంలో ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్నది మాత్రం ఇప్పుడే తెలియదు. భవిష్యత్ లో ఈ పరిణామాల ఫలితాలు తేలనున్నాయని చెప్పకతప్పదు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App 

Tags:    

Similar News