Ysrcp : వైసీపీలో విభేదాలు.. తాము రానే రామంటున్న ఎమ్మెల్యేలు
శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడ వైసీపీలో విభేదాలు తలెత్తాయి. మంత్రి కొట్టు సత్యనారాయణ పై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు.
శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడ వైసీపీలో విభేదాలు తలెత్తాయి. మంత్రి కొట్టు సత్యనారాయణ మీద వైసీపీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. దుర్గాదేవి శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పాస్‌లు ఇచ్చే విషయంలో ఆలయ పాలక మండలి తమకు సహకరించలేదని ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు తమ నియోజకవర్గం నుంచి వెళుతున్న కార్యకర్తలకు కూడా సరైన గౌరవం దక్కలేదన్నది వారి ఆరోపణగా ఉంది.
శరన్నవరాత్రుల్లో...
ప్రతి ఏడాది జరుగుతున్న శరన్నవరాత్రుల్లో విజయవాడ నగర ఎమ్మెల్యేలకు పాలకవర్గం ప్రాధాన్యత ఇచ్చేది. అయితే ఈసారి మాత్రం కొంత నిర్లక్ష్యం వహించిందన్నది ఎమ్మెల్యేల ఆరోపణ. ఎన్నికల ఏడాది తమను ఇబ్బంది పెట్టే విధంగా మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యవహరించారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. మంత్రి ఏకపక్ష నిర్ణయాలతో తాము రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నామని వారు చెప్పినట్లు సమాచారం.
వెల్లంపల్లి ఆగ్రహం...
బెజవాడ నగరంలో రెండు స్థానాలు వైసీపీకి ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించగా, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ తొలి విడత మంత్రివర్గంలో పనిచేశారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కానీ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయినా పెద్దగా బాధపడలేదు కానీ, దుర్గగుడిలో తనకు జరుగుతున్న అవమానాన్ని మాత్రం సహించలేకపోతున్నారు.
మల్లాది కూడా...
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా అలక వహించారని చెబుతున్నారు. ఆయనకు కూడా ప్రాధాన్యత దక్కలేదు. మరికాసేపట్లో జరగనున్న తెప్పోత్సవానికి కూడా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. హంస వాహనంపై ఇద్దరినీ అనుమతించక పోవడం వల్లనే వారు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తెప్పోత్సవానికి ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి కొట్టు సత్యనారాయణ మాత్రం తనకు ఇవేమీ తెలియదని, తాను తెప్పోత్సవం ఏర్పాట్లలో ఉదయం నుంచి బిజీగా ఉన్నానని చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా బోటును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.