Chandrababu Bail : బెయిల్ వచ్చినా లాభం లేదా? డీలా పడుతున్న నేతలు

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చినా టీడీపీ నేతలు పెద్దగా హ్యాపీగా లేరు

Update: 2023-10-31 07:18 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని సంతోషించాలా? ఇది తాత్కాలికమేనని బాధపడాలా? అన్న ఆలోచనలో టీడీపీ నేతలున్నారు. యాభై మూడు రోజుల పాటు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అనేకసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలించలేదు. మరొక వైపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై కూడా తీర్పు రావాల్సి ఉంది. దీంతో పాటు మరికొన్ని కేసులు చంద్రబాబు మీద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసినా ఉపయోగం ఏమిటన్న ప్రశ్న నేతల నుంచి వస్తుంది. ఆయన హైదరాబాద్ కే పరిమితం కావాల్సి ఉంటుందన్న వేదనలో తెలుగు తమ్ముళ్లున్నారు.

అదే ఊరట...
జైలు నుంచి వస్తున్నారన్న కొద్దిగా ఊరట మినహాయించి అంతకు మించి ఆనందం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎందుకంటే ఆయన బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కంటి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు ఇచ్చిన షరతుల్లోనూ ఇదే తెలిపింది. తమకు సీల్డ్ కవర్ లో ఎక్కడ చికిత్స చేయించుకున్నదీ వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. అంటే నాలుగు వారాల పాటు చంద్రబాబు ఆసుపత్రిలోనైనా ఉండాలి. లేదంటే హైదరాబాద్ లోని తన ఇంట్లోనైనా ఉండవచ్చు. అంతే తప్ప రోడ్డుపైకి వచ్చి జనంతో మాట్లాడేందుకు వీలులేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదని తెలిసి మళ్లీ క్యాడర్ లో నిరాశ నెలకొంది. నియోజకవర్గాలకు వచ్చి పర్యటన చేసే ఛాన్స్ లేదు.
తెలంగాణ ఎన్నికలు...
తెలంగాణ ఎన్నికలు ముగియడానికి రెండు రోజుల ముందు ఆయన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈలోపు రెగ్యులర్ బెయిల్ పై ఊరట లభిస్తే చెప్పలేం. అదే సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై అనుకూలంగా తీర్పు వస్తే అంతకంటే మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాని అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు కావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చంద్రబాబు జైలుకు వెళ్లిన యాభై మూడు రోజుల నుంచి పార్టీ పడకేసిందనే చెప్పాలి. లోకేష్ కూడా పూర్తిగా తన యువగళం పాదయాత్రను నిలిపివేసి న్యాయనిపుణులతో చర్చిస్తూ రాజమండ్రి, ఢిల్లీకి తిరుగుతున్నారు.
ఇంటికే పరిమితం...
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలులేదు. మీడియాతో మాట్లాడటానికి అవకాశం లేదు. నెల రోజుల పాటు మాత్రం ఆయనకు ఇంట్లోనో, ఆసుపత్రిలోనూ విశ్రాంతి దొరుకుతుంది మినహాయించి రాజకీయ పరంగా ఎటువంటి లాభం లేదని బాధపడుతున్నారు. అయితే తన ఇంటిలో ఉండి పార్టీని నడిపించేందుకు చంద్రబాబు ప్రయత్నించవచ్చని, ఇది కొంతలో కొంత నయమని పార్టీ అగ్రనేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని ఆనందపడాల్సిన సమయం కాదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం.
Tags:    

Similar News