Malla Reddy : మల్లారెడ్డి వణికిపోతుంది అందుకేనట.. ఆ రూట్లే వస్తే ఏం చేయాలి?
మాజీ మంత్రి మల్లారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు పొసగదు. టీడీపీలో కలసి పనిచేసినా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు
మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు పొసగదు. టీడీపీలో కలసి పనిచేసినా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. తనను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారంటూ పలుమార్లు మల్లారెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. మల్లారెడ్డి తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేశారు. రేవంత్ పై మల్లారెడ్డి మంత్రి పదవిలో ఉన్నప్పుడు నిప్పులు చెరిగారు. తనను అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి క్షోభ పెట్టారంటూ మల్లారెడ్డి పలు టీవీ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
ఇద్దరి మధ్య...
దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో మంత్రిగా ఉన్న మల్లారెడ్డిపై ఆరోపణలు చేశారు. మల్లారెడ్డికి తాను కూడా ఛాలెంజ్ విసురుతున్నానని, భూములు ఆక్రమించుకోలేదని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కూడా రేవంత్ మల్లారెడ్డికి సవాల్ విసిరారు. ఇలా ఒకరినొకరు ఛాలెంజ్ లు చేసుకుంటూ మీడియాకు ఎక్కారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగి ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు వీలులేని పరిస్థితులు కల్పించుకున్నారు.
భూ ఆక్రమణల ఆరోపణలతో...
మల్లారెడ్డి తన మెడికల్ యూనివర్సిటీ కోసం అనేక భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే అనేక భూములు ఆయన పేరిట స్వాహాచేశారని, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో వందలాది ఎకరాలు ఆక్రమించుకుని ధరణి వచ్చిన తర్వాత దానిని చేర్చుకోగలిగారని విమర్శలు వినిపించాయ. అంతేకాకుండా అసైన్‌మెంట్ ల్యాండ్స్ కూడా ఆక్రమించుకుని పేదల కడుపు కొట్టారంటూ అప్పట్లో విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే నాడు మల్లారెడ్డి మంత్రి... రేవంత్ ఎంపీ మాత్రమే.
సీఎం కావడంతో...
కానీ ఇప్పుడు రివర్స్ అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మల్లారెడ్డి సాధారణ ఎమ్మెల్యేగా మారారు. తన తొలి బాణం రేవంత్ రెడ్డి మల్లారెడ్డిపైనే ఎక్కుపెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తన క్యారెక్టర్ ను కించపర్చే విధంగా అవమానపర్చేలా మాట్లాడిన మల్లారెడ్డిని వదిలిపెట్టబోనని కూడా రేవంత్ ఎన్నికలకు ముందే సన్నిహతుల వద్ద వ్యాఖ్యానించడంతో ఇప్పుడు మల్లారెడ్డికి అదే భయం పట్టుకుంది. లెక్కకు మించి ఉన్న ఇంజినీరింగ్, వైద్య కళాశాలలో ప్రభుత్వం ఏ తీరున విరుచుకపడి తనకు ఆర్ధికంగా నష్టం చేకూరుస్తుందోనన్న ఆందోళనలో మల్లారెడ్డి ఉన్నారు. మరి రేవంత్ నిజంగానే కక్ష సాధింపు చర్యలకు దిగుతారా? కామెడీ అని వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.