Puvvada Ajay : పువ్వాడ అజయ్.. క్యాడర్‌కు కూడా దొరకని పరిస్థితి ఎందుకు?

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గత ఇరవై రోజులకు పైగానే క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదు

Update: 2024-01-01 10:14 GMT
Puvvada Ajay : పువ్వాడ అజయ్.. క్యాడర్‌కు కూడా దొరకని పరిస్థితి ఎందుకు?

former minister Puvwada ajay 

  • whatsapp icon

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గత ఇరవై రోజులకు పైగానే క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆయన ఓటమి నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నారు. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అన్న సామెత పువ్వాడ అజయ్ కు సరిగ్గా సరిపోతుంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఓటమి పాలయిన తర్వాత అస్సలు కనిపించడం మానేశారు. ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. పలకరించాలని వెళ్లిన కార్యకర్తలకు కూడా ఆయన అపాయింట‌్‌మెంట్ దొరకడం లేదు. అజయ్ బాబు లేరన్న సమాధానం మాజీ మంత్రి కార్యాలయం సిబ్బంది నుంచి వస్తుందని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఓటమితోనే అంత కుంగిపోవాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆ ధీమాతోనే...
గెలుపోటములు సహజం. ఓటమి పాలయినంత మాత్రాన కుంగిపోతే మరోసారి గెలిచేందుకు పరిస్థితులు అనుకూలించవు. ఏ రాజకీయ నేతకు అయినా ఈ సూత్రం వర్తిస్తుంది. ఖమ్మం నియోజవర్గాన్ని పువ్వాడ అజయ్ తన అడ్డాగా భావించారు. అక్కడ కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పాటు తనకు తప్ప మరెవ్వరికీ మద్దతివ్వరన్న ధీమా పువ్వాడ అజయ్ లో కనిపించేది. అందులోనూ కేటీఆర్ తో సన్నిహిత్వం పెంచుకుని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీకి దూరం చేయడంలో సక్సెస్ కాగలిగారు. అలా కాకుండా తుమ్మలతో సాఫ్ట్్ కార్నర్ గా ఉండి ఉంటే తుమ్మల బీఆర్ఎస్ లోనే కొనసాగే వారు. ఆయనకు వేరే చోట టిక్కెట్ దక్కి ఉంటే పువ్వాడ అజయ్ విజయం నల్లేరు మీద నడకే అయ్యేది.
తుమ్మలను ఏరికోరి...
కానీ తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో కొనసాగి ఎక్కడైనా గెలిస్తే తన మంత్రి పదవికి ఎసరు వస్తుందని భావించిన పువ్వాడ అజయ్ ఆయనను దూరం చేయడం మొదలుపెట్టారు. తుమ్మలను కారు పార్టీకి దూరం చేయడంలో ఆయన కృతకృత్యులయినా ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లి తనపై పోటీ చేస్తారని ఊహించి ఉండరు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీ చేస్తారని పువ్వాడ గట్టిగా విశ్వసించారు. అందుకే తుమ్మలను లైట్ గా తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం చేయించిన సర్వేల్లో తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయించడమే బెటర్ అని భావించడంతోనే పువ్వాడకు కష్టాలు మొదలయ్యాయి.
అనేక కారణాలు...
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం కూడా పువ్వాడ మెడకు చుట్టుకుట్టన్నట్లయింది. ఖమ్మం జిల్లా అంటేనే బీఆర్ఎస్ కు కొంత వ్యతిరేక పవనాలు వీస్తాయి. అది మొన్నటి ఎన్నికల్లో మరింతగా కనిపించింది. ఖమ్మం జిల్లాలో భద్రాచలం మినహా ఎక్కడా కారు పార్టీ గెలవలేదంటే ఆ పార్టీకి అక్కడ ఏ మాత్రం విషయం ఉందన్నది అర్థమవుతుంది. అందుకే పువ్వాడ అజయ్ తన చేజేతులా చేసుకుని తనపై తుమ్మలను ప్రత్యర్థిగా తెచ్చుకుని తన కొంపను తానే ముంచుకున్నారన్న కామెంట్స్ పార్టీలోనూ వినిపిస్తన్నాయి. వరసగా రెండుసార్లు గెలిచానన్న ఆత్మవిశ్వాసం కావచ్చు.. బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు.. తాను ఖర్చు పెట్టే డబ్బులు గెలిపిస్తాయని పువ్వాడ భావించి ఉండవచ్చు. కానీ ఓటమి దరి చేరడంతో ఆయన గత మూడు వారాలుగా క్యాడర్‌కు కూడా కనిపించడం లేదు. ఇదే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News