Congress Cabinet : మంత్రి పదవుల కోసం తహతహ.. నేతల్లో ఆశలు
సీనియర్ నేతల నుంచి జూనియర్ల వరకూ మంత్రి పదవుల కోసం ఆశపడుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేతల్లో ఉత్సాహం నెలకొంది. ఇక తమ కలలు నెరవేరినట్లేనని అందరూ భావిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో తమకు మంత్రి పదవి గ్యారంటీ అని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. సీనియర్లు ఎటూ ఆ రకంగానే ఆలోచిస్తారు. ఇక కొత్త వాళ్లు కూడా సామాజికవర్గం కోణంలో అదృష్టం తమ తలుపు తట్టుతుందేమోనన్న ఆశతో ఉన్నారు. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో ఆశావహులున్నారు. వీరిని సర్దుబాటు చేయడం పార్టీ అగ్రనేతలకు కష్టంగానే మారనుంది.
తెలంగాణ వచ్చిన తర్వాత...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ఏపీ పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పదవులు లభించేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి అధికారంలోకి రావడంతో మనదే హవా అనుకున్న వాళ్లు మంత్రి పదవులపై మనసు పారేసుకున్నారు. అనేక సార్లు గెలిచి పార్టీనే అంటి పెట్టుకున్న వాళ్లు కొందరు కాగా, ఇతర పార్టీల నుంచి వచ్చి టిక్కెట్లు తెచ్చుకుని గెలిచిన వారు కూడా ఉన్నారు. మరికొందరయితే టిక్కెట్లు రాకపోయినా పార్టీని వీడకుండా గెలుపు కోసం పనిచేసినందున తమకు బహుమతిగా మంత్రి పదవి ఇవ్వడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అందరి వాదనలు కరెక్టే. ఎవరి ఆలోచనలు తప్పు కాదు. అలా అని అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం కూడా సాధ్యం కాదు.
రెండు, మూడు విడతలుగా...
ఈ పరిస్థితుల్లో మంత్రివర్గలో ఎవరెవరి పేర్లు ఉంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సామాజికవర్గాలు, ప్రాంతాల వారీగా చూసి మరీ ఎంపిక చేసే అవకాశముంది. అయితే ఒకే విడతలో మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు లేకపోవచ్చు. రెండు, మూడు విడతలుగా విస్తరించడం బెటరన్న అభిప్రాయం కూడా అగ్రనేతల నుంచి వ్యక్తమయినట్లు తెలిసింది. మరీ అసంతృప్తులుంటే వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. కాంగ్రెస్ కు భారీ మెజారిటీ రాలేదు. బొటాబొటీగానే సీట్లు వచ్చాయి. అందరినీ సంతృప్తిపర్చడం ఎవరికి సాధ్యం కాదు. అలాగని అసంతృప్తుల సంఖ్యను పెంచుకోవడం కూడా మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొందరి పేర్లు మాత్రం ఖచ్చితంగా కేబినెట్ లో ఉండేలా జాగ్రత్తలు పడతారని ఆశిస్తున్నారు.
ఈ పేర్లు మాత్రం...
ముఖ్యమంత్రిగా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తొలి కేబినెట్ లో మాత్రం సీతక్క, వివేక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొందరు ఉండే అవకాశాలున్నాయని తెలిసింది. సామాజికవర్గాల వారీగా కూడా చూస్తారు కాబట్టి అన్ని వర్గాల వారికీ కేబినెట్ లో అవకాశం కల్పించాలని భావస్తే ఈ ఎన్నికల్లో గెలవని వాళ్లకు కూడా మంత్రి పదవులు దక్కవచ్చు. మైనారిటీ కోటా కింద తొలుత షబ్బీర్ ఆలీని కేబినెట్ లో తీసుకునే అవకాశముందని కూడా తెలుస్తోంది. మరి ఎవరు ఉంటారో? ఎవరు బయట ఉంటారన్నది చూడాల్సి ఉంది. ఇక దామోదర రాజనర్సింహను స్పీకర్ గా చేయాలని కూడా భావిస్తున్నారు. అయితే ఆయన అందుకు అంగీకరించకపోతే జీవన్ రెడ్డిని స్పీకర్ చేసి దామోదరకు మంత్రి పదవి ఇచ్చే అవకాశముంది.