తమ్ముళ్లూ... నాట్ హ్యపీ

పవన్ కల్యాణ్ పొత్తుపై ప్రకటించి వారం రోజులు దాటి పోతుంది. అయితే దీనిపై టీడీపీ నేతలు అంత సంతోషంగా లేరనే చెప్పాలి

Update: 2023-09-20 06:29 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై ప్రకటించి వారం రోజులు దాటి పోతుంది. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు అంత సంతోషంగా లేనట్లు కనిపిస్తుంది. వారి నుంచి స్వాగతించే ప్రకటనలు ఎలాంటివి వెలువడటం లేదు. గంటాశ్రీనివాసరావు వంటి వారు మినహా అత్యధిక మంది జనసేనతో పొత్తుపట్ల పెద్దగా ఆసక్తి లేనట్లే కనపడుతున్నారు. నిజానికి ఏపీ రాజకీయాల్లో పెద్ద కుదుపుగానే చూడాలి. వచ్చే ఎన్నికల్లో రెండు బలమైన పార్టీలు పొత్తు పెట్టుకోవడం అంటే రాజకీయంగా కూడా అది అందరిలో చర్చకు దారి తీస్తుంది. పొత్తు వల్ల ఎవరికి నష‌్టం, ఎవరికి లాభం అన్న అంశాలపై గ్రామ స్థాయి నుంచి నగరాల వరకూ సామాన్య ప్రజలు చర్చించుకుంటారు.

తమకు అనుకూలంగా...
ఈ సమయంలో ఈ పొత్తును తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన పని రెండు పార్టీల నేతలది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన జనసేనాని పవన్ బయటకు వచ్చి రానున్న ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని ప్రకటించారు. లోకేష్, నందమూరి బాలకృష్ణ సాక్షిగా ఈ సంచలన ప్రకటన చేశారు. అప్పుడే పవన్ వెనకున్న జనసేన నేతలయితే చప్పట్లతో ఆ ప్రకటనను స్వాగతించారు కానీ, టీడీపీ నేతలు మాత్రం పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత కూడా ముఖ్యమైన నేతల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రచారంలో ఉన్నప్పటికీ...
తెలుగుదేశం, జనసేన పొత్తు ఉంటుందని గత కొన్ని నెలలుగా కాదు.. కాదు..కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేకపోయినా ఇటీవల కాలంలో లోకేష్ యువగళం పాదయాత్రతో పాటు చంద్రబాబు అరెస్ట్, ఆయన వరస జిల్లాల పర్యటనతో పార్టీకి బలం తెచ్చి పెట్టారు. అధికార వైసీపీని ఈసారి ఎలాగైనా ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకు తమ పర్యటనలకు వస్తున్న స్పందన కారణమని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేనతో పొత్తు రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుందేమోనన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ వల్ల కాపు సామాజికవర్గం ఓట్లు రావడం మాట ఎలా ఉన్నా ఉన్న ఓట్లు పోతాయేమోనన్న బెంగ నేతలను పట్టుకున్నట్లుంది.
అనేక కారణాలు...
ప్రధానంగా బీసీ సామాజికవర్గం పార్టీకి మరింత దూరమయితే తమ పరిస్థితి ఏంటన్నది ఎక్కువ మంది నేతల్లో కనిపిస్తున్న ఆందోళన. దీంతో పాటు జనసేనతో పొత్తు ఉంటే తమకంటే ఆ పార్టీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా భావించడం కూడా మరో కారణం. ఒకవేళ అధికారంలోకి వచ్చినా పవన్ తో ప్రతిదీ సమస్య అని, ప్రతి నిర్ణయాన్ని ఆయన సమర్థించినా, వ్యతిరేకించినా ఇబ్బందులు తప్పవని మరికొందరు సూచిస్తున్నారు. అందుకే పవన్ పెద్ద ప్రకటన చేసినప్పటికీ ఎవరూ పొత్తుపై సానుకూలంగా స్పందించ లేదని చెబుతున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు తమ మనసులో మాట చెప్పాలని అధిక మంది వెయిట్ చేస్తున్నారని తెలిసింది. అందుకే పేలాల్సిన పవన్ ప్రకటన పేలవంగా ముగిసిపోయింది.


Tags:    

Similar News